Telugu Global
Telangana

సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు.. పోలీసుల అదుపులో సునిల్ కనుగోలు కార్యాలయ సిబ్బంది

పోలీసులు కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. వీళ్లు ఐఐఎం, బిట్స్ పిలానీ, ఎన్ఐటీలో చదువుకున్న గ్రాడ్యుయేట్లుగా పోలీసులు గుర్తించారు.

సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు.. పోలీసుల అదుపులో సునిల్ కనుగోలు కార్యాలయ సిబ్బంది
X

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు పెట్టిన ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్‌ ప్రొఫైల్స్ ఉపయోగించి సీఎం కేసీఆర్‌ను దుర్బాషలాడుతుండటమే కాకుండా, ప్రభుత్వం పరువు తీసేలా నకిలీ వార్తలను వ్యాపింప చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం మంగళవారం రాత్రి మాధాపూర్‌లోని సునిల్ కనుగోలు కార్యాలయంపై దాడి చేసింది.

ఎన్నికల వ్యూహకర్త, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న సునిల్ కనుగోలు మాధాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఓ ఆఫీస్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కమ్ సోషల్ మీడియా కార్యాలయం పేరుతో సనాలీ స్పాజియో అనే భవనం నాలుగో అంతస్తులో కార్యకలాపాలు జరుగుతున్నాయి. అందులో పని చేస్తున్న సిబ్బంది ఐపీ మాస్కింగ్ టూల్స్ ఉపయోగించి పలు నకిలీ ఖాతాలు సృష్టించారు. ఆ ఖాతాల సాయంతో సీఎం కేసీఆర్‌పై అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం పరువు పోయేలా నకిలీ వార్తలు వ్యాపింపజేస్తున్నారు.

కాగా, పోలీసులు కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. వీళ్లు ఐఐఎం, బిట్స్ పిలానీ, ఎన్ఐటీలో చదువుకున్న గ్రాడ్యుయేట్లుగా పోలీసులు గుర్తించారు. కొంత కాలంగా సునిల్ కనుగోలు కార్యాలయంలో పని చేస్తూ.. మాస్కింగ్ టెక్నాలజీ ఉపయోగించి తమ లొకేషన్ తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్యాలయం నుంచే కేసీఆర్, ప్రభుత్వంపై నకిలీ ఖాతాలతో పోస్టులు పెడుతున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

కేవలం సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపైనే కాకుండా తెలంగాణ వ్యతిరేక, టీఆర్ఎస్ వ్యతిరేక పోస్టులను కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ఐపీ అడ్రస్‌లను ఉపయోగించి ఈ దుష్ప్రచారం జరుగుతున్నట్లు, వాటికి ఆ కార్యాలయమే వేదికగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని మరింత లోతుగా విచారిస్తున్నారు.

కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునిల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు.

First Published:  14 Dec 2022 7:22 AM IST
Next Story