Telugu Global
Telangana

మ్యాచ్ పాసుల కోసం పోలీసుల ఒత్తిడి.. తలపట్టుకుంటున్న హెచ్‌సీఏ

ఇప్పటికే మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచగా హాట్ కేకుల్లాగా అమ్ముడు పోయాయి. ఇక కార్పొరేట్ బాక్సులు, వీఐపీ పాసులకు కూడా డిమాండ్ బాగానే ఉంది. అయితే, హైదరాబాద్ పోలీసుల నుంచి పాసులు కావాలంటూ హెచ్‌సీఏపై ఒత్తిడి పెరుగుతోంది

మ్యాచ్ పాసుల కోసం పోలీసుల ఒత్తిడి.. తలపట్టుకుంటున్న హెచ్‌సీఏ
X

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. 2019 డిసెంబర్ 6న చివరి సారిగా టీ20 మ్యాచ్ జరిగింది. కరోనా కారణంగా మ్యాచ్ హోస్ట్ చేసే అవకాశం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు రాలేదు. 2020, 2021 ఐపీఎల్ సీజ‌న్లు యూఏఈలో నిర్వహించారు. ఈ ఏడాది ఐపీఎల్‌ను కొన్ని నగరాలకే పరిమితం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 25న ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20కి ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచగా హాట్ కేకుల్లాగా అమ్ముడు పోయాయి. ఇక కార్పొరేట్ బాక్సులు, వీఐపీ పాసులకు కూడా డిమాండ్ బాగానే ఉంది. అయితే, హైదరాబాద్ పోలీసుల నుంచి పాసులు కావాలంటూ హెచ్‌సీఏపై ఒత్తిడి పెరుగుతోంది.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఈ మ్యాచ్‌కు పూర్తి భద్రత ఏర్పాట్లు రాచకొండ పోలీసులే చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీఏ కొన్ని పాసులను పోలీసులకు కేటాయించింది. స్టేడియం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో వాళ్లకు కూడా కొన్ని కేటాయించారు. అయితే మిగిలిన హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా పాసులు కావాలని భారీగా ఒత్తిడి వస్తోంది. దాదాపు 4 వేల పాసుల కోసం పోలీసుల నుంచి వినతులు వచ్చినట్లు హెచ్‌సీఏ అధికారి ఒకరు చెప్పారు. కొంత మంది పోలీస్ అధికారులు లేఖలు రాయగా.. మరి కొంతమంది నేరుగా ఫోన్లు చేసి అడుగుతున్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక హెచ్‌సీఏ అధికారులు తలపట్టుకుంటున్నారు.

ఉప్పల్ స్టేడియం పూర్తి సామర్థ్యం 55 వేలు. అయితే భద్రతా కారణాలు, కార్పొరేట్ బాక్సులు, స్పాన్సర్ల కోసం వదిలేసిన సీట్లు మినహా.. దాదాపు 40 వేల టికెట్లు విక్రయించారు. ఇప్పుడు పోలీసుల నుంచి 4వేల పాసులు కావాలని లెటర్లు, కాల్స్ వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. వారందరికీ ఇవ్వడానికి స్టేడియం సామర్థ్యం కూడా సరిపోదని అంటున్నారు. చాన్నాళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండటంతో.. మ్యాచ్ నిర్వహణ ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చని హెచ్‌సీఏ భావించింది. కానీ ఇలా ఫ్రీ పాసుల కోసం ఒత్తిడి పెరిగిపోతుండటంతో గేట్ ఆదాయం పడిపోతుందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. పాసులు కొంత మందికి అడ్జెస్ట్ చేయవచ్చు. కానీ ఇవ్వనివాళ్లు ఎలా ఫీల్ అవుతారో.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని భయపడుతున్నారు.

కేవలం పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచే కాకుండా జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ నుంచి కూడా పాసుల కోసం రిక్వెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. స్టేడియంకు నీటి సరఫరా, విద్యుత్ కూడా అవసరమే. ఆ రెండు శాఖలకు కొన్ని పాసులు అడ్జెస్ట్ చేశాము. కానీ పోలీసు శాఖ నుంచి వచ్చిన రిక్వెస్టే చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే అనధికారికంగా రాచకొండ, హైదరాబాద్ సీపీలకు అధికారులు తెలియజేసినట్లు సమాచారం. తాము భారీ మొత్తంలో పాసులు అడ్జెస్ట్ చేయలేమని.. ఇచ్చిన వరకు సర్దుకోమని చెప్పినట్లు తెలుస్తున్నది.

First Published:  18 Sept 2022 12:20 PM IST
Next Story