బండి సంజయ్ కుమారుడికి పోలీసుల నోటీసులు
బండి భగీరథ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతనికి పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నోటీసులు వారం రోజుల క్రితం జారీ చేసినప్పటికీ పోలీసులు దీనిని గోప్యంగా ఉంచారు. హైదరాబాద్‌లోని ఓ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న బండి సంజయ్ కుమారుడు అసభ్య పదజాలంతో ఓ విద్యార్థిని దూషించి.. అతనిపై భౌతిక దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
జనవరి 17న ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా, దీనిపై సదరు యూనివర్సిటీ స్టూడెంట్ ఎఫైర్స్ చీఫ్ కోఆర్డినేటర్ సుఖేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దుండిగల్ పోలీసులు బండి సంజయ్ కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో న్యాయవాది కరుణసాగర్‌తో కలిసి ఈ నెల 18న నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతనికి పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలనేది ఆ నోటీసుల సారాంశం.