కామారెడ్డిలో అర్ధరాత్రి హైడ్రామా..
కాంగ్రెస్ ఇక్కడ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి కామారెడ్డిలో పోలీసులు సోదాలు చేపట్టారు.
సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గం తెలంగాణవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ రేవంత్ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే సమయంలో కామారెడ్డికి కేసీఆర్ రావడం వెనక పెద్ద మతలబు ఉందంటూ ప్రచారం చేస్తూ హడావిడి సృష్టిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా.. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడం, అందులోనూ ఆయన ఈసారి గజ్వేల్ తోపాటు కామారెడ్డిని కూడా ఎంపిక చేసుకోవడంతో ఆ నియోజకవర్గ పోరు కాస్త ప్రత్యేకంగా మారింది.
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టేలా లేదు. రేవంత్ రెడ్డి విజయం అంత సులభం కాదని తెలిసినా కూడా ఆయన కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఇక్కడ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి కామారెడ్డిలో పోలీసులు సోదాలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, కాంగ్రెస్ నేత గడ్డం ఇందుప్రియ ఇంటికి పోలీసులు రాత్రివేళ వచ్చారు. భారీగా నగదు ఉందనే ఫిర్యాదుతో అర్ధరాత్రి దాటాక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి సోదాలు చేపట్టారు. అర్ధరాత్రి పోలీసులు రావడం ఏంటని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వారిని నిలదీశారు. మహిళా కానిస్టేబుల్స్ ఎక్కడ అంటూ ఇందుప్రియ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సోదాల అనంతరం పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.
కామారెడ్డిలో కావాలనే తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈరోజు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో కావాలనే పోలీసులు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డిలో రేవంత్ విజయం ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కామారెడ్డితోపాటు, కొడంగల్ లో కూడా రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమంటున్నారు.
♦