రేవంత్ రెడ్డికి 'రెడ్ డైరీ' కష్టాలు.. పోలీస్ కేసులు
అందరి పేర్లు డైరీలో రాసుకుంటున్నానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పోలీసు సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలకు దిగుతామంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు.
"అన్నీ గుర్తుపెట్టుకుంటా, పోలీసుల తప్పులన్నీ రెడ్ డైరీలో రాసుకుంటున్నా, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా తిరిగి చెల్లిస్తా"నంటూ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్నింగ్ కాస్తా తెలంగాణ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జిల్లా పోలీస్ అధికారుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తాము ఎవరికీ వత్తాసు పలకమని.. చట్టానికి, న్యాయ స్థానాలకు లోబడి మాత్రమే పనిచేస్తామని చెప్పారు తెలంగాణ పోలీసులు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, అనవసరంగా పోలీస్ వ్యవస్థను విమర్శించొద్దని అన్నారు. రేవంత్ రెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు పోలీస్ అసోసియేషన్ నేతలు. భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్లలో రేవంత్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
రెడ్ డైరీలో రాసి ఏం చేస్తారు..?
అందరి పేర్లు డైరీలో రాసుకుంటున్నానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పోలీసు సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలకు దిగుతామంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై బురదజల్లాలనుకోవడం పద్ధతి కాదని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని చెప్పేందుకే పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. తమపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. ఈ కేసులపై ఇంకా కాంగ్రెస్ నుంచి ఎవరూ రియాక్ట్ కాలేదు. రేవంత్ రెడ్డి వర్గం స్పందించాల్సి ఉంది.