వీడిన రూ.కోటి ఆభరణాల చోరీ కేసు మిస్టరీ - వేరే కేసులో విచారిస్తుండగా పట్టుబడిన నిందితుడు
ఆభరణాల చోరీ కేసు విషయమై ఫిర్యాదు చేసిన నల్లమోతు పవన్‌కుమార్ అదే సమయంలో అక్కడికి వచ్చాడు. బల్లపై ఉంచిన పరికరాలను చూసిన అతను వాటిలో వజ్రాల నాణ్యతను తనిఖీ చేసే పరికరం తనదేనని చెప్పాడు. దీంతో మైలారం పవన్‌ని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, అసలు గుట్టు బయటపడింది.
దొంగను పక్కనే పెట్టుకుని పాపం.. ఊరంతా వెదికారు ఆ పోలీసులు. ఆఖరికి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా అతని గుట్టు బయటపడింది. దీంతో కేసులో చిక్కుముడి వీడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకెళితే.. ఈ నెల 19న బంజారాహిల్స్‌లోని సింగాడికుంట బస్తీలో నివసించే మైలారం పవన్‌కుమార్ (21) పక్కింట్లో ఉండే ప్రవీణ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. చోరీలో భాగంగా రెండు సెల్‌ఫోన్లను కూడా ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన ప్రవీణ్ పవన్‌కు ఫోన్ చేసి నిలదీశాడు. దీంతో హబీబ్‌నగర్‌లో ఉన్న పవన్ ఆ రెండు సెల్‌ఫోన్లను ప్రవీణ్‌కు పంపించాడు. అయితే అవే కాదని, రూ.5 వేల నగదు కూడా మాయమైందని, ఆ డబ్బు కూడా ఇవ్వాలని ప్రవీణ్ గట్టిగా చెప్పాడు. అది తనకు తెలియదంటూ పవన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ఈ నెల 21న సింగాడికుంట ప్రాంతానికి పవన్‌ని ప్రవీణ్ స్నేహితుడు గుర్తించి అతనికి సమాచారం అందించాడు. వారిద్దరూ కలిసి నిందితుడిని పట్టుకొని డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అదే సమయంలో రూ.కోటి విలువైన ఆభరణాల చోరీ కేసు దర్యాప్తులో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ క్రైమ్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడే తలమునకలై ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌ని విచారణ చేస్తున్న పోలీసు సిబ్బంది అతని జేబులో ఉన్న వస్తువులను తీసి బల్లపై పెట్టారు.
ఆభరణాల చోరీ కేసు విషయమై ఫిర్యాదు చేసిన నల్లమోతు పవన్‌కుమార్ అదే సమయంలో అక్కడికి వచ్చాడు. బల్లపై ఉంచిన పరికరాలను చూసిన అతను వాటిలో వజ్రాల నాణ్యతను తనిఖీ చేసే పరికరం తనదేనని చెప్పాడు. దీంతో మైలారం పవన్‌ని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, అసలు గుట్టు బయటపడింది. కోటి రూపాయల విలువైన ఆభరణాల చోరీ కేసులో నిందితుడు అతడేనని తేలింది. అతని నుంచి పోలీసులు కొన్ని వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతని గదిలో మరికొన్ని ఆభరణాలు కూడా దొరికాయి. మరికొన్ని ఆభరణాలను తనఖా పెట్టినట్టు గుర్తించారు. లాకర్‌ను శ్మశానవాటికలో దాచిపెట్టినట్టు నిందితుడు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇదే చోరీలో మరో నిందితుడు చింతలబస్తీకి చెందిన మచ్చ అలియాస్ అంజి(22)ని అనుమానిస్తూ.. అతని కోసం గాలిస్తుండగా, అనుకోకుండా మైలారం పవన్‌కుమార్ దొరికాడని పోలీసులు వెల్లడించారు. మైలారం పవన్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఓ బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి వారం క్రితమే అతను జైలు నుంచి వచ్చాడు. మరో నిందితుడు అంజి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.