Telugu Global
Telangana

తెలంగాణలో పోడు పట్టాల పంపిణీకి కొత్త మహూర్తం

ఆసిఫాబాద్ నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలు అందిస్తారు.

తెలంగాణలో పోడు పట్టాల పంపిణీకి కొత్త మహూర్తం
X

తెలంగాణలో పోడు భూములకు పట్టాల పంపిణీ ఈరోజు నుంచి మొదలు కావాల్సి ఉండగా ఇప్పుడా మహూర్తం మారింది. పోడు పట్టాల పంపిణీని మొదలు పెట్టేందుకు కొత్త తేదీ ఖరారు చేశారు. ఈనెల 30నుంచి పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ మొదలు పెడతారు అధికారులు.

ఆసిఫాబాద్ నుంచి మొదలు..

ఈనెల 30న సీఎం కేసీఆర్, ఆసిఫాబాద్ నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్. గిరిజనులకు పోడు పట్టాలు ఆయనే అందిస్తారు. అదే రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలు అందిస్తారు.


వాయిదా ఎందుకంటే..?

తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నేటి(ఈనెల 24)నుంచి మొదలు కావాల్సి ఉండగా దాన్ని 30వతేదీకి మార్చినట్టు కాసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తేదీని మార్చినట్టు తెలిపింది. జాతీయ ఎన్నికల కమిటీ తెలంగాణలో పర్యటిస్తుండడం ఈ కార్యక్రమం వాయిదాకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. జాతీయ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వారు అందుబాటులో ఉండకపోవచ్చని అందుకే పోడు పట్టాల పంపిణీ తేదీని మార్చామని చెప్పారు. ఈ నెల 29 న బక్రీద్ పండుగ కూడా వుండటంతో.. అది కూడా పూర్తయిన తర్వాత జూన్ 30 నుంచి పట్టాల పంపిణీ మొదలు పెడతామని తెలిపింది ప్రభుత్వం. జూన్ 30న నూతనంగా నిర్మించిన ఆసిఫాబాద్ జిల్లా కలక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. అదే రోజు పోడు పట్టాలను ఆయన పంపిణీ చేస్తారు.

First Published:  24 Jun 2023 3:49 PM IST
Next Story