ఈనెల 6న తెలంగాణకు మోదీ.. అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన
మొత్తం తెలంగాణకు 39 అమృత్ భారత్ స్టేషన్లు కేటాయించగా తొలి దశలో 21 స్టేషన్లలో పనులు మొదలు కాబోతున్నాయి. రూ.894 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
ఎన్నికల ఏడాదిలో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 21 అమృత్ భారత్ స్టేషన్లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మొత్తం తెలంగాణకు 39 అమృత్ భారత్ స్టేషన్లు కేటాయించగా తొలి దశలో 21 స్టేషన్లలో పనులు మొదలు కాబోతున్నాయి. రూ.894 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
అమృత్ భారత్ స్టేషన్లు అంటే..?
అప్పటికే ఉన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంకోసం అమృత్ భారత్ స్టేషన్ అనే పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయిస్తారు. ఆ నిధులతో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణీకుల సౌకర్యార్థం వసతుల కల్పన, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, ఉచిత వైఫై తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. వీటితోపాటు స్టేషన్లో ఇతర అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, నగరానికి ఇరువైల ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, అవసరాన్నిబట్టి రూఫ్ ప్లాజాలు కూడా ఏర్పాటు చేస్తారు.
ఎక్కడెక్కడ..? ఎంతమొత్తం
హైదరాబాద్ (నాంపల్లి)- రూ. 309 కోట్లు
నిజామాబాద్- రూ. 53.3 కోట్లు
కామారెడ్డి- రూ. 39.9 కోట్లు
మహబూబ్ నగర్- రూ. 39.9 కోట్లు
మహబూబాబాద్- రూ. 39.7 కోట్లు
మలక్ పేట్ (హైదరాబాద్)- రూ. 36.4 కోట్లు
మల్కాజ్ గిరి (మేడ్చల్)- రూ. 27.6 కోట్లు
ఉప్పుగూడ (హైదరాబాద్)- రూ. 26.8 కోట్లు
హఫీజ్ పేట (హైదరాబాద్)- రూ. 26.6 కోట్లు
హైటెక్ సిటీ (హైదరాబాద్)- రూ. 26.6 కోట్లు
కరీంనగర్- రూ. 26.6 కోట్లు
రామగుండం (పెద్దపల్లి)- రూ. 26.5 కోట్లు
ఖమ్మం- రూ. 25.4 కోట్లు
మధిర (ఖమ్మం)- రూ. 25.4 కోట్లు
జనగాం- రూ. 24.5 కోట్లు
యాదాద్రి (యాదాద్రి భువనగిరి)- రూ. 24.5 కోట్లు
కాజీపేట జంక్షన్ (హన్మకొండ)- రూ. 24.5 కోట్లు
తాండూర్ (వికారాబాద్)- రూ. 24.4 కోట్లు
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)- రూ. 24.4 కోట్లు
జహీరాబాద్ (సంగారెడ్డి)- రూ. 24.4 కోట్లు
ఆదిలాబాద్- రూ. 17.8 కోట్లు
ఈ 21తోపాటు మొత్తం 39 స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ల పథకాన్ని అమలు చేస్తారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ఇదివరకే రూ. 715 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి 221 కోట్ల రూపాయలను కూడా కేంద్రం కేటాయించింది.