వరంగల్ పర్యటనకు గంటా 40నిమిషాలు కేటాయించిన మోదీ
ఈనెల 8న వరంగల్ లో పర్యటిస్తారు మోదీ, వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభతో తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది బీజేపీ.
ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకునే దగ్గర్నుంచి తిరిగి హకీంపేట విమానాశ్రయం నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 25నిమిషాలు ప్రధాని తెలంగాణలో ఉంటారు. విమానాశ్రయానికి రాకపోకల సమయం తీసేస్తే కేవలం గంటా 40 నిమిషాల్లో ఆయన అధికారిక పర్యటన పూర్తవుతుంది.
ఇదే షెడ్యూల్..
ఈనెల 8న ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ హైదరాబాద్ కి వస్తారు.
హకీంపేటలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు ఉదయం 9.45 గంటలకు చేరుకుంటారు.
9:50 గంటలకు హెలికాప్టర్ లో వరంగల్ కు పయనం.
10:35 గంటలకు వరంగల్ చేరిక
10:45 నుంచి 11:20 గంటల వరకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
11:30 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు బహిరంగ సభ
12.15 గంటలకు వరంగల్ హెలిప్యాడ్ నుంచి హకీంపేటకు పయనం
1.10 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రాజస్థాన్ తిరుగు పయనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో బీజేపీ హడావిడి పడుతోంది. తెలంగాణకు ఏదో చేసేశాం, ఇచ్చేశాం అని చెప్పుకోడానికి తరచూ మోదీ ఇక్కడ వాలిపోతున్నారు. ఈనెల 8న వరంగల్ లో పర్యటిస్తారు, వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభతో తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది బీజేపీ. ఇటీవలే ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీతో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకంటే ఎక్కువగా జనసమీకరణ చేయాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. వరంగల్ లో ఎన్నికల స్టంట్ అయిపోయిన తర్వాత ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజస్థాన్ కి వెళ్తారు మోదీ.