Telugu Global
Telangana

జూలై 8న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీకు శంకుస్థాపన

కాజీపేటలో రైల్వే ఓవర్ హాలింగ్ ఫెసిలిటీతో పాటు.. కేంద్ర ప్రకటించిన వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

జూలై 8న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీకు శంకుస్థాపన
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో నాలుగు నెలల్లో రానుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ.. తెలంగాణకు వరుసగా ప్రాజెక్టులు కేటాయిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్వే లైన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా కాజీపేటలో రైల్వే కోచ్ ఓవర్ హాలింగ్ యూనిట్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8న రానున్నట్లు పీఎంవో ధ్రువీకరించింది.

కాజీపేటలో రైల్వే ఓవర్ హాలింగ్ ఫెసిలిటీతో పాటు.. కేంద్ర ప్రకటించిన వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది.

వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇంత వరకు కేంద్రలోని బీజేపీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా.. కోచ్ ఫ్యాక్టరీ కాకుండా.. కేవలం ఓవర్ హాలింగ్ యూనిట్‌ను మాత్రం కేటాయించింది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ఇప్పటికే మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అక్కడ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేక టెక్స్‌టైల్ పార్కులకు ఆర్థికసాయం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన వినతులు పంపించింది. అప్పట్లో కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఖర్చులు భరించి.. భూ సేకరణ చేసి.. మెగా టెక్స్‌టైల్ పార్కును ముందుకు తీసుకొని వెళ్లింది. అయితే, ఇటీవల మరో సారి తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాయడంతో కేంద్ర స్పందించి... వరంగల్ పార్కుకు ఆర్థిక సాయం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధాని పర్యటన నేపథ్యంలో జూలై 8న హైదరాబాద్‌లో జరగాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.

First Published:  29 Jun 2023 6:50 PM IST
Next Story