Telugu Global
Telangana

తీర్పు వచ్చేసింది.. మళ్లీ నేనే ప్రధాని

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓట్లు రెండింతలు చేసిన ప్రజలు, ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వాలని పిలుపునిచ్చారు మోదీ.

తీర్పు వచ్చేసింది.. మళ్లీ నేనే ప్రధాని
X

ప్రజలు ఆల్రడీ తీర్పు ఇచ్చేశారని మూడోసారి కూడా తానే ప్రధాని అని నిర్ణయించారని నాగర్ కర్నూల్ సభలో ధీమాగా చెప్పారు మోదీ. బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ఈసారి ఎన్డీఏకి 400 సీట్లు గ్యారెంటీ అని అన్నారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ ప్రజలు తీర్మానం చేశారని, బీజేపీ గెలుపుని ఆపడం ఎవరి వల్లా కాదని అన్నారాయన. మల్కాజ్‌గిరి రోడ్‌ షోలో నిన్న జన ప్రవాహాన్ని చూశానని చెప్పిన మోదీ.. యువత, మహిళలు, వృద్ధులు చాలా మంది రోడ్లపై నిల్చొని బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. తనను మూడోసారి ప్రధానిని చేసేందుకు ప్రజలు ఉత్సాహంతో వేచి చూస్తున్నారని చెప్పారు.


రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన బిడ్డను ఓడించాలని కాంగ్రెస్ నేతలు చూశారని, తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అగ్ర వర్ణాలు పైన కూర్చున్నాయని.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తోందని అన్నారు మోదీ. బీఆర్ఎస్ కూడా ఇలాంటి పార్టీయేనన్నారు. గత పదేళ్లలో కేంద్ర పథాకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకున్నాయని చెప్పారు మోదీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలసి తెలంగాణ ప్రజలను మోసం చేశాయని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ వస్తే ఆ రెండు పార్టీల ఆటలు సాగవని చెప్పారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలుంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ సేవ చేసే అవకాశం తనకు లభిస్తుందని చెప్పారు మోదీ.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓట్లు రెండింతలు చేసిన ప్రజలు, ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వాలని పిలుపునిచ్చారు మోదీ. ప్రజలు ఓట్లు వేస్తే కుటుంబ సభ్యులకు కుర్చీలిచ్చే అవసరం తనకు లేదన్నారు. 140 కోట్ల మంది ప్రజలు మోదీ కుటుంబ సభ్యులేనని చెప్పారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి చేసే గ్యారెంటీ అని అన్నారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మోదీ, అవినీతిపై పోరాడేందుకు తనకు ఆశీర్వాదం ఇవ్వాలన్నారు.

First Published:  16 March 2024 3:13 PM IST
Next Story