మోదీ ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన అరెస్ట్ లు
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
తెలంగాణలో మోదీ పర్యటన కలకలం రేపుతోంది. గో బ్యాక్ మోడీ అనే బ్యానర్లతో స్థానికులు నిరసన తెలియజేస్తున్నారు. వామపక్షాల నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు ఆయన రామగుండం బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉదయాన్నే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్ కి తరలించారు. అయితే కూనంనేని పోలీస్ స్టేషన్ లోనే దీక్షకు దిగారు.
అరెస్ట్ లు అప్రజాస్వామికం..
మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అరెస్ట్ లు అప్రజాస్వామికమని మండిపడ్డారు. తామెక్కడో జిల్లాల్లో ఉండి నిరసనలు తెలియజేస్తుంటే, మోదీకి ఎలాంటి హాని జరుగుతుందని మండిపడ్డారు. నిరసన తెలియజేయడం పౌరుల ప్రజాస్వామిక హక్కు అని అన్నారాయన.
సహజంగా ప్రముఖుల పర్యటనలో నిరసనలు తెలియజేస్తారనుకునేవారిని హౌస్ అరెస్ట్ చేయడం ఆనవాయితీ. అయితే ఇక్కడ పోలీసులు సీపీఐ నేతల్ని హౌస్ అరెస్ట్ కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి తరలించడం సంచలనంగా మారింది. కూనంనేనితోపాటు పలువురు సీపీఐ కార్యకర్తల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నాయకులు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారనే సమాచారం ఉంది. ఇక ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఇప్పటికే తెలంగాణలో హడావిడి మొదలైంది. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తబోతున్నాయి. ఏపీలో పర్యటన సంతోషంగా ముగించుకుని వస్తున్న మోదీకి తెలంగాణలో మాత్రం నిరసన సెగ తప్పేలా లేదు.