ఇవాళ రాష్ట్రానికి మోడీ..షెడ్యూల్ ఇదే..!
ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ మరిన్ని వరాలు కురిపిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన పార్టీలు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకు 3, 4 బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ సైతం రంగంలోకి దిగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర బీజేపీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొంటారు.
ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. సభ ముగిసిన తర్వాత మళ్లీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ మరిన్ని వరాలు కురిపిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ సభలోనే బీజేపీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు.. భారీ జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోడీ.. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 11న మరోసారి మోడీ రాష్ట్రానికి రానున్నారు.