Telugu Global
Telangana

పాపం అమిత్ షా.. ఈ హోర్డింగ్స్ చూస్తే తట్టుకోగలడా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ జరిగిన మరుసటి రోజే అమిత్ షా వస్తుండటంతో హైదరాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా హోర్డింగ్స్ వెలిశాయి.

పాపం అమిత్ షా.. ఈ హోర్డింగ్స్ చూస్తే తట్టుకోగలడా?
X

బీజేపీలో నెంబర్ 2గా పిలుచుకునే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇవ్వాళ హైదరాబాద్ రానున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ రైజింగ్ డే పరేడ్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించనున్నారు. సీఐఎస్ఎఫ్ రైజింగ్ ‌డే వేడుకలను ఢిల్లీ బయట నిర్వహించడం ఇదే తొలి సారి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించడంతో తొలి సారి హైదరాబాద్‌లో ఈ వేడుక జరుగనున్నది. దీనికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ జరిగిన మరుసటి రోజే అమిత్ షా వస్తుండటంతో హైదరాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా హోర్డింగ్స్ వెలిశాయి. బీఆర్ఎస్ అభిమానులు బీజేపీ వైఖరిని తెలియజేసేలా వ్యంగ్యంగా ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందరూ మచ్చలేని వారిగా మారిపోతారనేలా ఈ హోర్డింగ్ రూపొందించారు. గతంలో ఇలా బీజేపీ టార్గెట్ చేసి.. ఆ తర్వాత పార్టీలో చేరడంతో కేసులు లేకుండా పోయిన పలువురి పేర్లను ఇందులో ఉటంకించారు.

హిమంత బిశ్వ శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, విరూపాక్షప్ప, ఈశ్వరప్ప, జ్యోతిరాధిత్య సింధియా, అర్జున్ ఖోట్కర్ ఫొటోలతో ఓ భారీ హోర్డింగ్ వెలిసింది. అంతే కాకుండా దాని కింద వెల్కమ్‌ టూ అమిత్ షా అని పెద్దగా ముద్రించారు. దీన్ని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయ్యింది. అసలు అమిత్ షాపై ఏంటీ ర్యాగింగ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఈ హోర్డింగ్ చూస్తే తట్టుకోగలడా అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.


First Published:  12 March 2023 10:30 AM IST
Next Story