Telugu Global
Telangana

గ్యాస్ సిలండర్ లపై మోడీ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్

గ్యాస్ సిలండర్ లపై నరేంద్ర మోడీ ఫోటోలతో కూడిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపులో మోడీ ఫోటో గురించి చేసిన రచ్చ నేపథ్యంలో ఈ వీడియో ఆసక్తి రేపుతున్నది.

గ్యాస్ సిలండర్ లపై మోడీ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్
X

మొన్న తెలంగాణలోని ఓ రేషన్ షాపుకెళ్ళి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలు, చేతలు ట్రోల్ కు గురవుతున్నాయి. రేషన్ షాపులో నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఆమె కలెక్టర్ ను హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలపై టీఆరెస్ నేతలే కాక సోషల్ మీడియాలో కూడా నెటిజనులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై వ్యంగ్యంగా స్పందించారు. ఆయన ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.... ''కేంద్రం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయిలో తెలంగాణ వాటా ఉంది. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైస‌లు మాత్ర‌మే వ‌స్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల వ‌ద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అని బ్యాన‌ర్లు పెట్టే స‌మ‌యం వ‌చ్చింది'' కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక మరో మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నిర్మలా సీతారమన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధాని ఫొటోను రేషన్‌ దుకాణంలో పెట్టాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చే విధంగా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అసలు, కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు డబ్బులు తెలంగాణ నుంచి వెళ్తున్నాయంటూ ఘాటుగా రియాక్టయ్యారు. అలాంటప్పుడు కేంద్ర పథకాలకు సీఎం కేసీఆర్‌ బొమ్మ ఎందుకు పెట్టరంటూ తాము అడగకూడదా అంటూ.. హరీశ్ రావు విమర్శించారు.

ఇక సోషల్ మీడియాలో అయితే నిర్మలా సీతారామన్ ను నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా గ్యాస్ సిలండర్ లపై ఓ పోస్టర్ ప్రత్యక్షమైంది. ఆ పోస్టర్ లో ప్రధాని నరేంద్ర మోడి ఫోటో, దాంతో పాటు 1105 రూపాయలు అని రాసి ఉంది. ఓ ఆటోలో తీసుకెళ్తున్న సిలండర్లపై ఈ పోస్టర్లు అతికించి ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో ఏ నగరంలోది అన్నది మాత్రం తెలియ రాలేదు కానీ ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటిజనులు మాత్రం మీరు కోరుకున్న మోడీ ఫోటో ఇక్కడ బాగుందా నిర్మలాజీ అని కామెంట్లు చేస్తున్నారు.


First Published:  3 Sept 2022 2:55 PM IST
Next Story