Telugu Global
Telangana

హైకోర్టుకు చేరిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం

హెచ్‌సీఏకు చెందిన 160 మంది సభ్యులు డిసెంబర్ 11న ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.

హైకోర్టుకు చేరిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, ఇతర ఆఫీస్ బేరర్లకు మధ్య ఉన్న వివాదం చివరకు హైకోర్టుకు చేరింది. హెచ్‌సీఏ పాలకవర్గం గడువు గత ఏడాది సెప్టెంబర్ 26న ముగిసింది. అయినా సరే అజారుద్దీన్ అంతా తానై అసోసియేషన్‌ను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 11న హెచ్‌సీఏకు చెందిన సభ్యులు 160 మంది ఉప్పల్ స్టేడియం వద్ద సమావేశమై జనవరిలో ఎన్నికల నిర్వహించాలని నిర్ణయించారు. అంతే కాకుండా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వి. సంపత్ కుమార్‌ను హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా నియమిస్తూ తీర్మానం పాస్ చేశారు.

కాగా, హెచ్‌సీఏ సభ్యులు చేసిన తీర్మానాన్ని డిసెంబర్ 16న సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన పర్యవేక్షక కమిటీ సభ్యుడు వంకా ప్రతాప్ కొట్టేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖను సవాలు చేస్తూ హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు శివలాల్ యాదవ్, అర్షయ్ ఆయుబ్, మాజీ కార్యదర్శి జి. వినోద్‌లో మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంకా ప్రతాప్ లేఖను రద్దు చేయాలని, వి.సంపత్ కుమార్‌నే ఎన్నికల అధికారిగా కొనసాగిస్తూ ఎలక్షన్స్ నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు హైకోర్టును కోరారు.

వంకా ప్రతాప్‌కు తమ తీర్మానాన్ని రద్దు చేసే అధికారం లేదని, ఆ లేఖ చెల్లబాటు కాదని డిక్లేర్ చేయాలని పిటిషనర్లు న్యాయస్థానానికి విన్నవించారు. గత ఏడాది జులై 4 నుంచి మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తప్ప ఎవరూ హెచ్‌సీఏ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లేదన్నారు. ఆరు నెలల కిందటే మిగతా కార్యవర్గాన్ని సస్పెండ్ చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొని వచ్చారు. హెచ్‌సీఏ పాలక వర్గం గడువు కూడా సెప్టెంబర్ 26న ముగిసిపోయినట్లు చెప్పారు.

హెచ్‌సీఏకు చెందిన 160 మంది సభ్యులు డిసెంబర్ 11న ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. కాగా, హెచ్‌సీఏ మాజీ సభ్యుల వాదనలు విన్న హైకోర్టు కేసును ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

First Published:  1 Feb 2023 1:58 AM GMT
Next Story