తెలంగాణలో కార్యకలాపాలు రెట్టింపు చేస్తాం.. దావోస్ లో పెప్సీకో కీలక ప్రకటన
దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో జరిగిన సమావేశంలో పెప్సీకో విస్తరణ ప్రణాళికలపై ఆ సంస్థ కార్పొరేట్ కార్యకలాపాల కార్యనిర్వాక ఉపాధ్యక్షులు రాబర్టో అజేవేడో, మంత్రి కేటీఆర్ తో చర్చించారు.
తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తామని పెప్సీకో కంపెనీ ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది పెప్సీకో యాజమాన్యం. హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపు చేస్తామని తెలిపింది. హైదరాబాద్ లో తమ ఉద్యోగులను 2800 నుంచి 4 వేలకు పైగా పెంచుతామని చెప్పింది.
హైదరాబాద్ లో పెప్సీకో సంస్థ 2019లో గ్లోబల్ బిజినెస్ సెంటర్ ప్రారంభించింది. అప్పుడు ఆ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 250. ఇప్పుడు 2800మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్యను 4వేలకు పెంచుతామని పెప్సీకో తెలిపింది. ఏడాదిలో అదనపు ఉద్యోగులను నియమించడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామని పెప్సీకో ప్రతినిధులు తెలిపారు. పెట్టుబడికి సంబంధించిన గణాంకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
PepsiCo Global Business Services Centre to expand big in Telangana!@robertocazevedo, EVP Corporate Affairs @PepsiCo met Minister @KTRTRS at Telangana Pavilion on the sidelines of #wef23, Davos and discussed various plans of the company in Telangana State.#TelanganaAtDavos pic.twitter.com/q9i32SuBZq
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 17, 2023
దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో జరిగిన సమావేశంలో పెప్సీకో విస్తరణ ప్రణాళికలపై ఆ సంస్థ కార్పొరేట్ కార్యకలాపాల కార్యనిర్వాక ఉపాధ్యక్షులు రాబర్టో అజేవేడో, మంత్రి కేటీఆర్ తో చర్చించారు. హైదరాబాద్ లో ఉన్న బిజినెస్ సర్వీస్ సెంటర్ ను స్వల్ప కాలంలోనే భారీగా విస్తరించామని, ఇందుకు నగరంలో ఉన్న అత్యుత్తమ మానవ వనరులే ప్రధాన కారణమని చెప్పారాయన. పెప్సీకో అంతర్జాతీయ కార్యకలాపాలకు అవసరమైన సేవలను హైదరాబాద్ కేంద్రం నుంచే అందిస్తామన్నారు. మానవ వనరుల డిజిటలైజేషన్, ఆర్థిక సేవల వంటి ప్రధానమైన అంశాలపై ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు రాబర్టో. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ ను విస్తరించడంతోపాటు తెలంగాణలో పెప్సీకో ఇతర విభాగాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చ జరిగింది.
హైదరాబాద్ లో కార్యకలాపాలను రెట్టింపు చేసేందుకు పెప్సీకో తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పెప్సీకో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరపున అందిస్తామన్నారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర విభాగాలు, రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని పెప్సీకో ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్న కేటీఆర్, ఇప్పటికే అనేక ప్రఖ్యాత సంస్థలు ఆహార ఉత్పత్తుల తయారీలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. పెప్సీకో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అనేక అంశాలు, కార్యక్రమాలను పెప్సీకో సంస్థ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ నీటి నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పెప్సీకో ఆసక్తిని వ్యక్తం చేసింది.