ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులా?
ప్రభుత్వం తీరుపై మండిపడ్డ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
ప్రజాపాలన అంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలా అని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులపై 'ఎక్స్' వేదికగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోందని, ఇప్పటి వరకు మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వలేదన్నారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్ కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి బయల్దేరిన వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. మాజీ సర్పంచులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరితే అక్రమ అరెస్టులు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వం కొనసాగుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకొని సమస్యలపై గొంతెత్తే వారిని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రం సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే సీఎం, మంత్రులు సమస్యలను గాలికొదిలేసి ఊరేగుతున్నారని మండిపడ్డారు.