Telugu Global
Telangana

కేటీఆర్ ట్వీట్‌కు చాలా క్రేజ్.. ట్యాగ్ చేస్తే సమస్య తీరుతుందన్న నమ్మకంలో ప్రజలు

కేటీఆర్ ఏ ట్వీట్ చేసినా.. దాని కింద కొంత మంది తమ సమస్యలను తెలియజేస్తూ ట్యాగ్ చేస్తున్నారు.

కేటీఆర్ ట్వీట్‌కు చాలా క్రేజ్.. ట్యాగ్ చేస్తే సమస్య తీరుతుందన్న నమ్మకంలో ప్రజలు
X

కేటీఆర్ ట్వీట్‌కు చాలా క్రేజ్.. ట్యాగ్ చేస్తే సమస్య తీరుతుందన్న నమ్మకంలో ప్రజలు

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ట్విట్టర్ వేదికగా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వివరాలను పంచుకోవడమే కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌కు 3.8 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కేటీఆర్ యాక్టీవ్‌గానే ఉన్నా.. ఎక్కువ మంది మాత్రం ట్విట్టర్‌నే ఫాలో అవుతుంటారు.

కాగా, ఇటీవల కేటీఆర్ ఏ ట్వీట్ చేసినా.. దాని కింద కొంత మంది తమ సమస్యలను తెలియజేస్తూ ట్యాగ్ చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్లకు తమ సమస్యలను జోడించి రీట్వీట్లు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా అనారోగ్య సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఒక రకంగా కేటీఆర్ ట్విట్టర్‌ హ్యాండిల్‌ను ప్రజలు గ్రీవెన్స్ సెల్‌లాగా ఉపయోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. సామాన్యులు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతీ సామాజిక వర్గానికి ఏదో ఒక పథకం అమలు జరుగుతోంది. దీంతో వీటికి సంబంధించిన సమస్యలు పెద్దగా ఏవీ రావు. కానీ అనారోగ్య సమస్యలను మాత్రం కేటీఆర్ దృష్టికి తీసుకొని వస్తుండటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం పకడ్బంధీగా అమలు జరుగుతోంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే చికిత్స అందిస్తోంది. లక్షలాది మందికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌లు నిర్వహిస్తున్నారు. గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు కూడా అందిస్తోంది. అయినా సరే కొన్ని అరుదైన వ్యాధులకు సంబంధించిన రిక్వెస్టులు ఎక్కువగా కేటీఆర్ ట్విట్టర్ హ్యాండిల్‌కు వస్తున్నాయి.

కేటీఆర్‌కు @KTRTRS, @KTRoffice అనే రెండు పర్సనల్ హ్యాండిల్స్ ఉన్నాయి. మరో హ్యాండిల్ ఉన్నా.. అది తన మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ అధికార అకౌంట్. కానీ, ఎక్కువ సమస్యలు కేటీఆర్ పర్సనల్ హ్యాండిల్‌కు వస్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలోనే అనారోగ్య సమస్యలకు చెందిన రిక్వెస్టులు వస్తున్నాయి. కేటీఆర్ కూడా వాటిని వెంటనే అడ్రస్ చేస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందికి ట్యాగ్ చేసి.. సాయం కోసం ఎదురు చూస్తున్న వారి వివరాలు తెలుసుకొని వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లబ్దిపొందిన వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. కేటీఆర్ వేగంగా స్పందిస్తుండటంతోనే ప్రజలు కూడా అత్యవసర సాయం కోసం ఆయననే ఆశ్రయిస్తున్నారు.

కేటీఆర్‌కు వస్తున్న ఇలాంటి ప్రత్యేకమైన విజ్ఞప్తులను పరిశీలించి, పరిష్కరించడానికి ఒక టీమ్ పని చేస్తోంది. కేటీఆర్ ఆదేశించిన వెంటనే ఆ టీమ్ వేగంగా స్పందించి అవసరం అయిన ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని సార్లు కేటీఆర్ బిజీగా ఉన్నప్పుడు.. జెన్యూస్ సమస్య అయితే టీమ్ ముందుగానే టేకప్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం కేటీఆర్ జిమ్ చేస్తున్న ఫొటో పెట్టగానే.. దాని కింద కూడా వైద్య సాయం కోసం రిక్వెస్టులు వచ్చాయి.

ఎన్ని రిక్వెస్టులు వచ్చినా కేటీఆర్ మాత్రం ఎలాంటి విసుగు లేకుండా పరిశీలిస్తున్నారు. ఇటీవల పీర్జాదిగూడకు చెందిన ముగ్గురు వికలాంగులైన ఆడపిల్లకు సాయం కావాలంటే కేటీఆర్ తక్షణం సాయం చేశారు. ఇదొక ఉదాహరణ మాత్రమే.

నిజమైన సమస్య ఉన్న వాళ్లు ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి అడిగితే పర్వాలేదు. అయితే ఇటీవల కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి అనవసరమైన కంప్లైట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు. బస్సులు రావడం లేదని, కరెంటు సమస్య ఉందంటూ తనకు సంబంధం లేని శాఖలపై కూడా కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది కొంత వరకు ఇబ్బందికరంగా మారింది. ఇతర శాఖ మంత్రులు కూడా కేటీఆర్‌లా వేగంగా స్పందిస్తే.. ఇలాంటి వేరే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పలువురు సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కేటీఆర్.. అక్కడ వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ సరికొత్త గవర్నెన్స్‌కు తెరతీశారని పలువురు మెచ్చుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వ పలుకుబడి కూడా పెరుగుతోందని.. ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు.



First Published:  24 Dec 2022 9:34 AM IST
Next Story