ఈవీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలి.. : అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం నగరంలోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ లో రవాణాశాఖ, టీజీఎస్‌ఆర్టీసీపై ఆయన సమీక్ష నిర్వహించారు. స్కూల్ బస్సులపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, 15 ఏళ్లు దాటిన బస్సులను సీజ్ చేయాలని ఆదేశించారు. రవాణాశాఖ ఆదాయం పెంచుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంత వరకు చేరకున్నామని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ను ఆరాతీశారు. రాష్ట్రంలోని 62 ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పనపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి స్కూల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో రవాణా శాఖ కొత్త లోగోను ప్రజలకు పరిచయం చేయాలని సూచించారు.
మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఈనెల 20వ తేదీ వరకు 111 కోట్ల జీరో టికెట్లు ఇష్యూ చేశామని ఆర్టీసీ అధికారులు వివరించారు. తద్వారా మహిళలు తమ చార్జీల రూపంలో రూ.3,747 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం కారణంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందని చెప్పారు. గతంలో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతంగా ఉండేదని, ఇప్పుడు 94 శాతానికి పెరిగిందన్నారు. ఆర్టీసీ ప్రయాణికుల్లో 65.56 శాతం మంది మహిళలే ప్రయాణిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 1,389 కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు. మొదటి విడతలో ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని మహిళ స్వయం సహాయక సభ్యులకు అద్దె బస్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఒక్కో మండల సమాఖ్యకు ఒక్కో అద్దె బస్సు ఇస్తామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాల ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. సమావేశంలో అధికారులు వీసీ సజ్జనర్, సురేంద్రమోహన్, రమేశ్, మమత, అపూర్వరావు, మునిశేఖర్, వినోద్ కుమార్, విజయపుష్ఫ తదితరులు పాల్గొన్నారు.