Telugu Global
Telangana

వర్షం లేదు, వరద మాత్రమే.. అయినా భయమే..

ఇప్పటికే భద్రాచలం వద్ద నీటిమట్టం 51.5 అడుగులకు చేరింది. 55 అడుగులకు చేరుకుంటుందనే అనుమానాలున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

వర్షం లేదు, వరద మాత్రమే.. అయినా భయమే..
X

జూలై నెలలో గోదావరి వరదలకు తోడు, జిల్లాలో పడిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి మాత్రం వర్షాలు లేవు, కేవలం వరదలతోనే గోదావరి వణికిస్తోంది. ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరదనీటితో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద నీటిమట్టం 51.5 అడుగులకు చేరింది. 55 అడుగులకు చేరుకుంటుందనే అనుమానాలున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొద్దిసేపు వరద తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. అనూహ్యంగా పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరో 48 గంటలసేపు వరదనీటి విషయంలో ముందు జాగ్రత్తతో ఉండాలంటున్నారు.

భద్రాచలంలో కలెక్టర్, ఎస్పీ మకాం..

గతంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, అధికారులు అప్రమత్తంగానే ఉన్నా.. ఊహించని వరద ప్రజల్ని ఊళ్లు వదిలిపోయేలా చేసింది. ఈసారి కూడా ఆ స్థాయిలో వరద వస్తుందనే అంచనాతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ భద్రాచలంలోనే మకాం వేశారు. గర్భిణులను కొత్తగూడెం ఎంసీహెచ్‌, భద్రాచలం ఏరియా ఆసుపత్రులకు పంపాలని అధికారులకు సూచించారు. ఏరియా ఆసుపత్రిలో 50 మంచాలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి అంబులెన్స్‌ ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. వరద తగ్గే వరకు ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారుల‌ను నియమిస్తూ విధులు కేటాయించారు. ప్రజలు సాహసం చేసి వాగులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశువులను మెరక ప్రాంతానికి తరలించాలని పేర్కొన్నారు.

వేలేరుపాడు మండలంలో దాదాపు 40 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. చింతూరు మండలంలో 25 గ్రామాల వరకు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువనుంచి వస్తున్న వరద తక్కువగానే ఉన్నా.. శబరి, పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా గతం కంటే 8 అడుగుల వరద నీరు అధికంగా వచ్చి చేరింది. పోలవరం వద్ద వరద నీటిమట్టం 24 మీటర్లుగా నమోదైంది. 10,10,387 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లా చింతూరు వద్ద ఆంధ్ర, ఛత్తీస్ ఘఢ్‌, ఒడిశా రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులపై వరద నీరు చేరింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నెల రోజుల వ్యవధిలో రెండో సారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

First Published:  11 Aug 2022 7:54 AM IST
Next Story