పెలికాన్ సిగ్నల్స్.. హైదరాబాద్ వాసులకు గొప్ప ఊరట
హైదరాబాద్ నగరంలో అన్నిచోట్ల ఇలాంటి పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే 30 ఏర్పాటు చేశారు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 47 అందుబాటులోకి వస్తాయి.
నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగుతాయి కానీ.. పాదచారులు రోడ్డు దాటాలంటే కాస్త కష్టమే. జీబ్రాలైన్స్ కనపడుతూనే ఉన్నా.. వాహనాల దూకుడు మాత్రం తగ్గదు. ఇక సిగ్నల్స్, జీబ్రా లైన్స్ లేనిచోట్ల రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగేయాల్సిందే. హైదరాబాద్ వాసులకు ఇలాంటి కష్టాలు తీర్చేందుకు ఇప్పుడు పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. సిగ్నల్ దగ్గర ఉన్న రెడ్ బటన్ నొక్కితే 15సెకన్లపాటు ట్రాఫిక్ ని ఆపి రోడ్డు దాటొచ్చు.
ఎలా పనిచేస్తాయంటే..?
ప్రస్తుతానికి రద్దీగా ఉండే రోడ్లపై పెలికాన్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 30చోట్ల ఈ సిగ్నల్స్ ఉన్నాయి. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతానికి పాదచారులు కాకుండా వాలంటీర్లు వీటిని ఆపరేట్ చేస్తున్నారు. రోడ్డు దాటాల్సిన అవసరం ఉన్నవారు 10మంది సిగ్నల్ దగ్గర చేరితే వాలంటీర్లు రెడ్ బటన్ నొక్కుతారు. 15సెకన్లపాటు ట్రాఫిక్ ఆగేట్టుగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ పూర్తయ్యేలోపు పాదచారులు రోడ్డు దాటాలి, ఆ తర్వాత వాహనాలు కదులుతాయి. ప్రతి మూడు నిమిషాలకోసారి ఇలా 15 సెకన్లపాటు పెలికాన్ సిగ్నల్స్ ఉపయోగించుకోవచ్చు.
హైదరాబాద్ నగరంలో అన్నిచోట్ల ఇలాంటి పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే 30 ఏర్పాటు చేశారు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 47 అందుబాటులోకి వస్తాయి. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. 8.5 కోట్లతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 77 చోట్ల ఈ సిగ్నల్స్ ఏర్పాటవుతున్నాయి. గత ఏడాది కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 52 మంది పాదచారులు మరణించారు. అందుకే ఈ రకమైన ప్రమాదాల నివారణపై నేతలు, అధికారులు దృష్టిపెట్టారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న పెలికాన్ సిగ్నల్స్ పాదచారులకు ఉపయోగకరంగా ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ అందుతోంది.