గాంధీభవన్ చేరిన పాలకుర్తి పంచాయితీ.. అత్త చేసిన పనికి షాక్‌లో ఎమ్మెల్యే!
యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే అని, పెత్తనం అంతా అత్త ఝాన్సీరెడ్డిదే అంటూ కృష్ణమూర్తి గౌడ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలకుర్తి పంచాయితీ గాంధీ భవన్ చేరింది. దేవరుప్పుల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్‌ను పార్టీ ఇన్‌ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి తొలగించారు. దీనిపై నియోజకవర్గంలో నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కృష్ణమూర్తి గౌడ్ మద్దతుదారులు ఏకంగా 50 వాహనాల్లో గాంధీ భవన్‌కు వచ్చి హంగామా సృష్టించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి తీరుకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. గేట్లను తోసుకుని గాంధీ భవన్‌లోకి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.
యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే అని, పెత్తనం అంతా అత్త ఝాన్సీరెడ్డిదే అంటూ కృష్ణమూర్తి గౌడ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న వారిని పట్టించుకోకుండా నిన్నమొన్న వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఝాన్సీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన పెట్టుకొని సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.