Telugu Global
Telangana

బీఆర్ఎస్ ని నేను ఎందుకు విమర్శించలేదంటే..?

వరంగల్ సభలో కూడా పవన్ కల్యాణ్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. సీఎం, సీఎం అంటూ రచ్చ చేశారు. అయితే పవన్ ఈ స్లోగన్లను లైట్ తీసుకున్నారు, స్పందించలేదు.

బీఆర్ఎస్ ని నేను ఎందుకు విమర్శించలేదంటే..?
X

తెలంగాణ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులను గౌరవించేందుకే తాను పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని చెప్పారు పవన్ కల్యాణ్. తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి పదేళ్లు అవకాశమివ్వాలనే తాను ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. ప్రజలు కోరుకుంటేనే తాను తెలంగాణకు వస్తానని అప్పుడే చెప్పానని.. ఇప్పటికి తనను ప్రజలు కోరుకున్నారని, అందుకే వరంగల్ కి వచ్చానన్నారు. ఇకపై ఏపీలో ఎలా తిరుగుతానో, తెలంగాణలో కూడా అలాగే తిరుగుతానని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన ఉంటుందని, బీజేపీతో కలసి అడుగులు వేస్తామని అన్నారు పవన్.


అవినీతి రహిత తెలంగాణ కావాలని తాను కోరుకున్నానని, కానీ ఇక్కడ అవినీతి పెచ్చుమీరిందని విమర్శించారు పవన్ కల్యాణ్. తెలంగాణ యువత బలంగా ఉంటే అవినీతి చేసేవారు టీవీల్లో మాట్లాడటానికి కూడా భయపడేవారన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలసి పవన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ తనకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందని చెప్పారు.

సీఎం సీఎం..

వరంగల్ సభలో కూడా పవన్ కల్యాణ్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. సీఎం, సీఎం అంటూ రచ్చ చేశారు. అయితే పవన్ ఈ స్లోగన్లను లైట్ తీసుకున్నారు, స్పందించలేదు. తాను అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేనని జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఆరు చోట్ల పవన్ కల్యాణ్ సభలు జరుగుతాయి. వరంగల్ లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత తాను మరోసారి ఇక్కడకు వస్తానని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు పవన్.

పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఎక్కడా బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకపోవడం విశేషం. ప్రభుత్వం, అవినీతి అన్నారే కానీ, ఆయన సూటిగా విమర్శ చేయలేదు. బీసీ సీఎం తెలంగాణకు కావాలన్నారు. తెలంగాణలో కూడా జనసేన నిలబడుతుందని చెప్పారు పవన్.


First Published:  22 Nov 2023 4:59 PM IST
Next Story