Telugu Global
Telangana

కేసీఆర్ తో స్నేహం ఉంది.. కానీ మోదీ విధానమే నచ్చింది

వరంగల్ సభలో లాగే కొత్తగూడెం సభలోనూ మాట్లాడారు పవన్ కల్యాణ్. నేరుగా బీఆర్ఎస్ ని ఆయన టార్గెట్ చేయలేదు. తాను ఏపీలో లాగా తెలంగాణలో తిరగలేదని, అందుకే తాను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదని చెప్పుకొచ్చారు పవన్.

కేసీఆర్ తో స్నేహం ఉంది.. కానీ మోదీ విధానమే నచ్చింది
X

కేసీఆర్ తో తనకు స్నేహం ఉందని, ఆ మాటకొస్తే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లోనూ తనకు మంచి మిత్రులున్నారని, కానీ రాజకీయ పరంగా తాను మోదీ విధానానికే మద్దతు తెలుపుతున్నానని చెప్పారు పవన్ కల్యాణ్. కొత్తగూడెం సభలో పాల్గొన్న ఆయన జనసేన అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజల్ని కోరారు. తాను తెలంగాణలో పర్యటించకపోయినా, ఇక్కడి సమస్యలపై స్పందించకపోయినా.. తెలంగాణలో జనసేన ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న నాయకులేనని చెప్పారు. వారే జనసేన ప్రయాణాన్ని కొనసాగించారని అన్నారు.


అవినీతి అంతమొందించాలి..

వరంగల్ సభలో లాగే కొత్తగూడెం సభలోనూ మాట్లాడారు పవన్ కల్యాణ్. నేరుగా బీఆర్ఎస్ ని ఆయన టార్గెట్ చేయలేదు. తాను ఏపీలో లాగా తెలంగాణలో తిరగలేదని, అందుకే తాను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదని చెప్పుకొచ్చారు పవన్. తెలంగాణలో అవినీతి జరుగుతోందని, ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి జరుగుతుందన్నారు పవన్. తెలంగాణలో జనసేన, బీజేపీ కలయికలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆకాంక్షించారు.

ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని చెప్పారు పవన్. తన ఇజం.. హ్యూమనిజం అని అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతివ్వాలని కోరారు. ప్రజలకు వెన్నంటి నిలబడే పార్టీలు తెలంగాణలో కావాలన్నారు. బీజేపీ పరిపాలన జరుగుతున్న రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యత ఉందని, గద్దరన్నకు చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని, ఆయన ఆశయాన్ని తాను రాజకీయంగా సాధిస్తానని చెప్పారు. 5 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే ఎన్నికలు రావాలని.. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ప్రతి రోజూ ఎన్నికలే అన్నట్టుగా ఉందన్నారు పవన్. హైదరాబాద్ చుట్టూ మాత్రమే అభివృద్ధి జరుగుతోందని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేశాక అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని అన్నారు.


First Published:  23 Nov 2023 2:47 PM IST
Next Story