Telugu Global
Telangana

తెలంగాణలో టీడీపీని ఇరుకున పెట్టిన పవన్..? బీఆర్‌ఎస్‌కి ప్లస్

ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్ రెడీగా ఉంది. కానీ.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తర్జనభర్జనలు పడుతూ.. ఢిల్లీ నుంచి పూర్తిస్థాయి అనుమతుల‌ కోసం నిరీక్షిస్తున్నాయి.

తెలంగాణలో టీడీపీని ఇరుకున పెట్టిన పవన్..? బీఆర్‌ఎస్‌కి ప్లస్
X

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నవంబరు 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ‌, 30న పోలింగ్.. డిసెంబరు 3న ఫలితాలను వెల్లడిస్తారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అలర్ట్ అయ్యాయి. గంటల వ్యవధిలోనే వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. కానీ, టీడీపీ, జనసేన నుంచి మాత్రం చడీచప్పుడు లేదు. దానికి ఓ లాజికల్ రీజన్ ఉంది.

ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్ రెడీగా ఉంది. కానీ.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తర్జనభర్జనలు పడుతూ.. ఢిల్లీ నుంచి పూర్తిస్థాయి అనుమతుల‌ కోసం నిరీక్షిస్తున్నాయి. అలానే తెలంగాణలో ఇప్పుటికే దాదాపు కనుమరుగైపోయినా టీడీపీ కూడా ఈసారి మళ్లీ తన ఉనికిని చాటుకోవాలని ఆశిస్తోంది. ఆ బాధ్యతల్ని నందమూరి బాలకృష్ణకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏపీ రాజకీయాల నుంచి బాలయ్యని తాత్కాలికంగా తప్పించడానికే తూతూ మంత్రంగా ఆ బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన ఈనెల ఆరంభంలోనే తెలంగాణలో కేవలం 32 సీట్లలో పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత అప్‌డేట్ లేదు.

తెలంగాణలో ఫెయిలైతే.. ఏపీలో ఇంపాక్ట్

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. కానీ.. తెలంగాణలో మాత్రం జనసేన ఇప్పుడు వెనుకంజ వేస్తోంది. దానికి కారణం.. ఒకవేళ తెలంగాణలో ఈ పొత్తు వికటిస్తే.. ఆ ప్రభావం ఏపీలోనూ పడుతుందని జనసేన భావిస్తోంది. అయితే.. పొత్తులో లేకుండా జనసేన ఒంటరిగా వెళితే.. అది టీడీపీతో పాటు జనసేనకి కూడా చేటు చేయనుంది. ఎందుకంటే..? జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, సనత్ నగర్, పటాన్ చెరు, ఉప్పల్, కొత్త గూడెం తదితర 32 స్థానాల్లో టీడీపీకి కూడా గతం నుంచి సెటిలర్ల రూపంలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో పొత్తులో వెళితేనే ఇద్దరికీ మంచిదని టీడీపీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌కి ప్లస్.. కాంగ్రెస్, బీజేపీకి తలనొప్పి

ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కానీ.. ఇప్పుడు రేసులోకి టీడీపీ, జనసేన కూడా రాబోతున్నాయి. ఇది కచ్చితంగా అధికార బీఆర్‌ఎస్‌కి కలిసిరానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ఇంకా రాజ‌మండ్రి జైల్లోనే ఉన్నారు. ఇక బాలయ్యని నమ్మి ఓట్లు వేస్తారా అంటే.. సందేహమే. అలానే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్‌పై పదునైన విమర్శలు చేసే సాహసం చేయకపోవచ్చు. కానీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని మాత్రం ఈ రెండు పార్టీలు ఎంతో కొంత చీల్చగలవు. అధికార బీఆర్‌ఎస్ పార్టీకి కావాల్సింది కూడా అదే..!

First Published:  9 Oct 2023 9:34 PM IST
Next Story