Telugu Global
Telangana

జనసేన ట్వీట్.. బ్లాక్ మెయిలింగ్ అనుకోవాల్సిందేనా..?

పవన్ వెనక్కు తగ్గుదామనుకుంటున్నారు. కానీ భయపడి తగ్గినట్టు కాకుండా, వ్యూహాత్మకంగా వెనకడుగు వేశామని చెప్పుకోబోతున్నారు. అందుకే తెలంగాణ నేతలతో మీటింగ్ పెట్టారు.

జనసేన ట్వీట్.. బ్లాక్ మెయిలింగ్ అనుకోవాల్సిందేనా..?
X

చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ తిరిగి జనసేన నేతలకు అందుబాటులోకి వచ్చారు. ప్రత్యేకించి తెలంగాణ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ తర్వాత జనసేన పార్టీ నుంచి వచ్చిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. గతంలో ఎప్పుడూ జనసేన నుంచి ఇలాంటి ట్వీట్లు రాలేదు. అంతా పవన్ ఇష్టం అని వదిలేస్తారు కానీ, నాయకుల డిమాండ్ ఇదీ అంటూ పార్టీ పరంగా ట్వీట్ ఎప్పుడూ వేయలేదు. కానీ ఈసారి నాయకులు పోటీ కోరుకుంటున్నారనే విషయం బయటకొచ్చింది. దానికి అధినాయకుడు సమాధానం కూడా విచిత్రంగానే ఉంది. పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చను బహిరంగ పరచడం విశేషం అనే చెప్పుకోవాలి. అంతే కాదు.. బీజేపీ, టీడీపీని పరోక్షంగా పవన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు.


వెనక్కి తగ్గకండి..

2023 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. నియోజకవర్గాల లిస్ట్ కూడా ప్రకటించారు. అయితే బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటున్న జనసేన, ఏపీలో టీడీపీతో కొత్తగా పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఒంటరిగా ఎలా పోటీ చేస్తుందనే ప్రశ్నలు వినిపించాయి. ఉన్నపార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందనుకున్న దశలో జనసేన అక్కడ సాధించేదేంటి అంటున్నారు. ఈ దశలో పరువు నిలుపుకోవాలంటే జనసేన వెనక్కు తగ్గాల్సిందే. తెలంగాణలో మరీ ఒకటీ రెండు ఓట్లు వస్తే, ఏపీలో రేపు మొహం ఎలా చూపించుకోవాలనే ప్రశ్న కూడా వినపడుతోంది. అందుకే పవన్ వెనక్కు తగ్గుదామనుకుంటున్నారు. కానీ భయపడి తగ్గినట్టు కాకుండా, వ్యూహాత్మకంగా వెనకడుగు వేశామని చెప్పుకోబోతున్నారు. అందుకే తెలంగాణ నేతలతో మీటింగ్ పెట్టారు.

ఈ మీటింగ్ లో తెలంగాణ నాయకులంతా పోటీకి దిగాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని, అయితే పవన్ వారిని బుజ్జగించారని, తనపై ఒత్తిడి ఉన్నట్టు చెప్పుకొచ్చారని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. నాయకులు పోటీకి సై అంటున్నా.. రెండురోజుల్లో ఆలోచించి చెబుతానని అధినాయకుడు వారిని పంపించినట్టు ఆ ప్రెస్ నోట్ సారాంశం. ఒకరకంగా ఈ ప్రెస్ నోట్ తో పవన్, బీజేపీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే లెక్క. అటు తెలంగాణ ఎన్నికల్లో బరిలో దిగుతామంటున్న టీడీపీకి కూడా పవన్ సిగ్నల్స్ పంపించారు. అంటే ఇక్కడ పవన్ తో ఎవరైనా చర్చలు జరపాలి, పోటీ వద్దు అని సర్దిచెప్పాలి, అప్పుడాయన వెనక్కి తగ్గినట్టు బిల్డప్ ఇవ్వాలి. ఈ సీన్లు జరగలేదు కాబట్టే.. నాయకుల మనసులో మాట అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణలో పోటీ చేస్తే ఫలితం ఉండదని తెలిసినా కూడా పవన్ ఏదో ప్రతిఫలం ఆశించి ఈ సీన్ క్రియేట్ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం.


First Published:  18 Oct 2023 12:04 PM IST
Next Story