Telugu Global
Andhra Pradesh

మన బలం చూసి ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోయారు..

వైసీపీ పాలనలో మెగాస్టార్, సూపర్ స్టార్ ని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు పవన్ కల్యాణ్. తాను ఏం చేసినా కోట్లాది మందిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తానన్నారు.

మన బలం చూసి ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోయారు..
X

ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టే బీజేపీ.. జనసేన పార్టీని దగ్గరకు తీసుకుందని, జనసేన నేతలు కమిట్‌ మెంట్‌ తో పని చేయటమే ఇందుకు కారణం అని వివరించారు పవన్ కల్యాణ్. మన పార్టీకి ఉన్న యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని చెప్పారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలో గుర్తింపు వచ్చిందన్నారు. తనను, తన భావజాలాన్ని నమ్మి యువత వెంట నడుస్తున్నారని, ఇంతమంది అభిమానుల బలం ఉన్నా తనకు గర్వం లేదని చెప్పారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశామని.. ఖమ్మం, మధిర, కూకట్‌ పల్లి, దుబ్బాక.. ఇలా ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారని గుర్తు చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్, ఏపీలో కూడా ఇదే విధంగా ముందుకెళ్లాలని నాయకులకు సూచించారు.

మెగాస్టార్, సూపర్ స్టార్ ని కూడా..

వైసీపీ పాలనలో మెగాస్టార్, సూపర్ స్టార్ ని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు పవన్ కల్యాణ్. తాను ఏం చేసినా కోట్లాది మందిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తానన్నారు. టీడీపీ, జనసేన కలిసి వెళ్లటానికి కారణాలు ఉన్నాయని, వైసీపీని ఎదుర్కోడానికే టీడీపీ, జనసేన కలిశాయని, ప్రతిపక్షం బతకాల్సిన పరిస్థితి ఉందని అన్నారు పవన్.

వైసీపీకి భావజాలం లేదు..

వైసీపీకి భావజాలం లేదని ఎద్దేవా చేశారు పవన్. ఎందుకోసం పనిచేస్తున్నారో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదన్నారు. అన్న ముఖ్యమంత్రి కావాలన్నదే వారి విధానం అని.. కానీ సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. తాను గత ఎన్నికల్లో ఓటమి పాలైతే అందరూ విమర్శలు చేశారని.. నాదెండ్ల మాత్రం తన వెనుక ఉన్నారని అందుకే ఆయన అంటే గౌరవమన్నారు పవన్.

ఏపీలో తన సినిమాలు ప్రదర్శించకుండా ఆపేసినా, తను బసచేసిన హోటల్‌ కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా పోరాటం మాత్రం ఆపలేదని గుర్తు చేశారు పవన్. తాను ఏనాడూ జాతీయ స్థాయి నాయకుల వద్దకు వెళ్లి వారి సహాయం అర్థించలేదన్నారు. మనమే జాతీయ నాయకులకు బలం కావాలని, మనం బలం చూపించకపోతే వాళ్లు గుర్తింపు ఇవ్వరని అన్నారు. పోరాటం చేసేవాళ్లనే వారు గుర్తిస్తారని, చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుందని అన్నారు పవన్.

First Published:  1 Dec 2023 6:01 PM IST
Next Story