Telugu Global
Telangana

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డైలమాలో పవన్ కల్యాణ్?

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటికే పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆశావహులు కూడా పోటీకి రెడీగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డైలమాలో పవన్ కల్యాణ్?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవ్వాళ ప్రారంభం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఒకరిద్దరికి మినహా అందరికీ బీఫామ్స్ ఇచ్చేయడంతో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మరో 19 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. బీజేపీ కూడా రెండు విడతలుగా టికెట్లు కేటాయించింది. అంతే కాకుండా జనసేనతో పొత్తు ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని సీట్లను పక్కన పెట్టింది. అయితే తెలంగాణలో పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటికే పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆశావహులు కూడా పోటీకి రెడీగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చారు. ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు వారాలకు పైగానే అయినా.. ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. ఏపీలో టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని గతంలోనే ప్రకటించారు. ఇదే క్రమంలో తెలంగాణలో కూడా కలిసి వెళ్తే గెలిచే ఛాన్స్ ఉంటుందని అంచనా వేసుకున్నారు. తెలంగాణలోని సెటిలర్ల ఓట్లు తప్పకుండా ప్లస్ అవుతాయని భావించారు. అయితే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అసలు తెలంగాణలో పోటీనే చేయకూడదని టీడీపీ నిర్ణయించకున్నది.

తెలంగాణలో పోటీలో లేకపోవడంపై మనస్తాపం చెంది టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా పార్టీని విడిచి వెళ్లిపోయారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ టీడీపీ నాయకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా పావులు కదుపుతున్నారు. టీడీపీలో సెటిలర్ల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోతుండటంతో జనసేనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లోని సెటిలర్లు ఇప్పటికే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి సమయంలో జనసేన అక్కడి సెటిలర్లను నమ్ముకొని పోటీ చేస్తే..కనీసం డిపాజిట్లైనా వస్తాయా అనే అనుమానం ఉన్నది. అదే జరిగితే ఏపీలోని వైసీపీకి జనసేనను విమర్శించడానికి మరో కొత్త ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకొని పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కనీసం కూకట్‌పల్లి నుంచి అయినా పోటీ చేయాలని జనసేన వర్గాలు పవన్ పై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. అయితే పవన్ మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్నారు.

First Published:  3 Nov 2023 9:21 AM IST
Next Story