పవన్ కల.. తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు
తెలంగాణలో 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం ఉంటుందన్నారు.
ఏపీలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే విషయంలో జనసేనకు ఇంకా క్లారిటీ లేదు. అయితే తెలంగాణ రాజకీయాలపై మాత్రం జనసేనానికి క్లారిటీ వచ్చేసినట్టుంది. వచ్చే దఫా తెలంగాణ అసెంబ్లీకి కనీసం 10మంది జనసేన ఎమ్మెల్యేలు వెళ్లాలన్నదే తన కల అని చెప్పారు.
జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న పవన్ పోటీపై తేల్చి చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం ఆయన తెలంగాణ జనసేన నేతలతో సమావేశమయ్యారు.
పోటీ ఎన్నిసీట్లలో..? పొత్తు ఎవరితో..?
తెలంగాణలో 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం ఉంటుందన్నారు.
ఎన్నికల సమయంలో తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానన్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని, కానీ ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందన్నారు పవన్. అయితే తెలంగాణలో ఎవరైనా తనతో పొత్తు పెట్టుకోడానికి వస్తే సంతోషం అని చెప్పారు. మన భావజాలానికి దగ్గరగా వస్తే ఓకే అని చెప్పారు.
కేసీఆర్ పాలన భేష్..
ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణలో పాలన బాగుందన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ, ఏపీ సమస్యలు రెండూ వేర్వేరని, వాటిని పోల్చలేమని చెప్పారు. ఆంధ్రాలో కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలని, అది చాలా కష్టం అని చెప్పారు.
ఏపీలో ఉన్నవారు సొంత బాబాయ్ ని చంపించుకునే వాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థను ఇష్టానుసారంగా తిట్టేవాళ్లని, పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడేవాళ్లని అన్నారు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఏపీలో విలువలేదని, అలాంటి నాయకత్వం ఇక్కడ లేదన్నారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలోనే తాను ఉన్నానని చెప్పారు.