తెలంగాణకు వారాహి.. పవన్ ప్రచారంపై ఉత్కంఠ
కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేపడతారా లేదా అనేది అధికారికంగా ధృవీకరించాల్సిన విషయం. బీజేపీ అభ్యర్థలు కోసం కాకపోయినా, కనీసం జనసేన అభ్యర్థులకోసం అయినా ఆయన వారాహిని తెలంగాణకు తీసుకురావాలి.
ఎట్టకేలకు తెలంగాణ బరిలో దిగుతోంది జనసేన. ఇన్నాళ్లూ త్యాగాలతో సరిపెట్టిన జనసేనాని, ఈసారి ఏకంగా అభ్యర్థుల పేర్లు ప్రకటించబోయే సరికి బీజేపీ సర్దుకుని పొత్తుకి సై అంది. 8-9 సీట్ల మధ్య ఊగిసలాట జరుగుతున్నా ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశముంది. అయితే అంతకంటే ముందు పవన్ కల్యాణ్ ప్రచార భేరీ కూడా ఖాయం అయినట్టే చెప్పుకోవాలి. ఈనెల 7న బీజేపీ బీసీ గర్జన సభలో మోదీతో కలసి వేదిక పంచుకున్నప్పటి నుంచి పవన్ ప్రచారంలోకి దిగినట్టే లెక్క.
పొత్తు ధర్మం పాటించి బీజేపీ తరపున ప్రచారం చేయడం పవన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది, కానీ జనసేన నేతలు స్వయంగా బరిలో దిగుతున్న సందర్భంలో ఆయన కచ్చితంగా మైకు అందుకోవాల్సిందే. వారాహిని తెలంగాణకు తేవాల్సిందే, ప్రచారం మొదలు పెట్టాల్సిందే. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆయన విమర్శలు చేస్తారా..? ఒకవేళ ఆ రెండు పార్టీలను తిట్టాల్సి వస్తే ఆయన డోస్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.
కాంగ్రెస్ కి టీడీపీ లోపాయికారీగా మద్దతిస్తోంది, ఈ సందర్భంలో కాంగ్రెస్ ని కానీ, రేవంత్ రెడ్డిని కానీ పవన్ తిడితే.. ఎలా అనే సందిగ్ధం కూడా నెలకొంది. ఒకవేళ విమర్శలు చేయాల్సి వస్తే సోనియా, రాహుల్ పైనే పవన్ తన పంచ్ డైలాగులు ఎక్కుపెట్టే అవకాశముంది. పోనీ కాంగ్రెస్ ని పక్కనపెడితే బీఆర్ఎస్ పై పవన్ వైఖరి ఏంటో స్పష్టంగా తేలాల్సి ఉంది. గతంలో కూడా ఎప్పుడూ పవన్, సీఎం కేసీఆర్ తో ఘర్షణ వాతావరణం కోరుకోలేదు. ఉద్యమ సమయంలో పవన్ కాస్త హడావిడి చేసినా, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల హరీష్ రావు పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారం రోజులు అన్నం మానేశానన్న పవన్ ని బీజేపీ తోడుగా తెచ్చుకుంటోందని, తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని విమర్శించారు హరీష్. కనీసం దీనికయినా పవన్ సమాధానం చెప్పాలి. అంటే కచ్చితంగా బీఆర్ఎస్ కు ఆయన బదులివ్వాలి.
ఈ విమర్శలు ప్రతి విమర్శల పర్వం మొదలైతే తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశముంది. కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేపడతారా లేదా అనేది అధికారికంగా ధృవీకరించాల్సిన విషయం. బీజేపీ అభ్యర్థలు కోసం కాకపోయినా, కనీసం జనసేన అభ్యర్థులకోసం అయినా ఆయన వారాహిని తెలంగాణకు తీసుకురావాలి.