పవన్ ఎన్నికల ప్రచారానికి రారా?
15వ తేదీ నుండి పవన్ ప్రచారంలోకి దిగుతారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేకానీ జనసేన పార్టీ నుండి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం ఇంతవరకు లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పవన్ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జనసేన తరపున 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని పవన్ ఎన్నికల బరిలోకి దిగారు. అభ్యర్థులు నామినేషన్లు వేసేశారు, ఎవరికి వారుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ ఇంతవరకు ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రచారం చేయలేదు.
అసలు ఎన్నికలు జరుగుతున్నాయన్న స్పృహలో కూడా లేనట్లున్నారు. 7న ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు మాత్రం హాజరయ్యారు. ఈ సభకు కూడా ఎందుకు హాజరయ్యారంటే నరేంద్ర మోడీ వచ్చారు కాబట్టే. తర్వాత నుండి ఇప్పటివరకు మళ్ళీ అడ్రస్ లేరు. 15వ తేదీ నుండి పవన్ ప్రచారంలోకి దిగుతారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేకానీ జనసేన పార్టీ నుండి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం ఇంతవరకు లేదు.
ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులను పోటీలోకి దింపిన పవన్ మరి వారి తరపున ఎందుకు ప్రచారంలోకి దిగలేదో మాత్రం ఎవరికీ అర్థంకావటంలేదు. మరో 13 రోజుల్లో ప్రచారం కూడా ముగుస్తోంది. ట్విట్టర్లో కూడా పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించమని అభిమానులకు, జనాలకు పవన్ తరపున విజ్ఞప్తి కూడా రాలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా జనసేన అభ్యర్థుల ప్రచారం పెద్దగా కనబడటంలేదు. టీవీల్లో కూడా ఎంతసేపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గురించే కనబడుతోంది కానీ ఒక్కసారి కూడా జనసేన అభ్యర్థుల గురించి కనీసం వార్తల్లో కూడా చెప్పలేదు.
జరుగుతున్నది చూస్తుంటే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేయటం పవన్‌కు ఇష్టంలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇష్టం లేకపోతే మరి 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ఒకప్పుడు పవనే ఎందుకు ప్రకటించారు? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తే కేసీయార్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి వస్తుందనే భయంతోనే పవన్ ప్రచారంలోకి దిగలేదనే టాక్ పెరిగిపోతోంది. బీసీ ఆత్మగౌరవ సభలో కూడా మోడీని పొగిడారు కానీ కేసీయార్ లేదా బీఆర్ఎస్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఏదేమైనా అభ్యర్థులను పోటీలోకి దింపి గాలికొదిలేశారనే నెగిటివ్ కామెంట్లు ఎక్కువైపోతున్నాయి.
♦