Telugu Global
Telangana

కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తున్న సొంత పార్టీ లీడ‌ర్లు

మొన్న చిన్నారెడ్డి, నిన్న సంబాని చంద్ర‌శేఖ‌ర్‌, నేడు పాల్వాయి స్ర‌వంతి ఇలా రోజుకో నేత కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని, అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన స్క్రీనింగ్ క‌మిటీని తిట్టిపోస్తున్నారు.

కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తున్న సొంత పార్టీ లీడ‌ర్లు
X

సాధార‌ణంగా ఎన్నిక‌ల వేళ అధికార పార్టీ మీద విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వినిపిస్తాయి. టికెట్ ఆశించేవారు ఎక్కువ‌గా ఉండ‌టం, రానివారు పార్టీని, నాయ‌కుల‌ను తిట్టి వేరే పార్టీల్లోకి వెళ్ల‌డ‌మో లేదా స్వ‌తంత్రంగా బ‌రిలోకి దిగ‌డ‌మో చేస్తుంటారు. కానీ అదేం విచిత్ర‌మో తెలంగాణ‌లో ఇప్పుడు అధికార బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌లోనే ఈ లొల్లి ఎక్కువ‌గా ఉంది. రోజుకో లీడ‌ర్ బ‌య‌టికొచ్చి కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. మొన్న చిన్నారెడ్డి, నిన్న సంబాని చంద్ర‌శేఖ‌ర్‌, నేడు పాల్వాయి స్ర‌వంతి ఇలా రోజుకో నేత కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని, అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన స్క్రీనింగ్ క‌మిటీని తిట్టిపోస్తున్నారు.

జీవితమంతా కాంగ్రెస్‌కు ధార‌పోసిన నేత‌లే

జి.చిన్నారెడ్డి తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా కాంగ్రెస్ పార్టీలో గ‌ళం వినిపించిన నేత‌. వ‌న‌ప‌ర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా ప‌ని చేశారు. వ‌న‌ప‌ర్తిలో త‌న‌ను కాద‌ని మేఘారెడ్డికి టికెట్ ఇవ్వ‌డంతో ఆయ‌న మండిప‌డుతున్నారు. అధిష్ఠానం నిర్ణ‌యానికి క‌ట్టుబడి ఉంటాన‌ని చెబుతూనే కాంగ్రెస్ స్క్రీనింగ్ క‌మిటీ అమ్ముడుపోయింద‌ని, త‌న రాజ‌కీయ జీవితాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు. తన తండ్రి పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి 60 ఏళ్లు కాంగ్రెస్‌లోనే కొనసాగారని, ప్రత్యేక రాష్ట్రం కోసం, కాంగ్రెస్ కోసం చివ‌రి శ్వాస‌కు పోరాడార‌ని.. అలాంటి పార్టీలో విలువలు తగ్గిపోయాయని పాల్వాయి స్ర‌వంతి విమర్శించారు. కాంగ్రెస్ బ్రోక‌ర్ల పార్టీగా మారిపోయింద‌ని ఘాటు కామెంట్లు చేసి దానితో తెగ‌తెంపులు చేసేసుకున్నారు.

సంబాని సైతం

పాలేరు నుంచి నాలుగుసార్లు గెలిచి మంత్రిగా కూడా ప‌ని చేసిన సంబాని చంద్ర‌శేఖ‌ర్ సైతం పార్టీని వీడారు. స‌త్తుప‌ల్లి టికెట్ ఇవ్వ‌కుండ మట్టా రాగమయికి అవకాశం ఇవ్వ‌డంతో తీవ్ర నిరాశకు గురై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కీల‌క నేత‌ల‌తో క‌లిసి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. కొత్తగూడెం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎడ‌వ‌ల్లి కృష్ణ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే పట్టించుకోలేదంటూ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. మరో కీలక నేత మానవతా రాయ్ స‌త్తుప‌ల్లి టికెట్ రాలేద‌ని కాంగ్రెస్‌ను విమ‌ర్శించి కారెక్కారు.

First Published:  12 Nov 2023 5:35 AM
Next Story