Telugu Global
Telangana

పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం

పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన జీవన్‌రెడ్డి

పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం
X

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. లేఖను సోనియా, రాహుల్‌, ప్రియాంకకు పంపారు. పార్టీ ఫిరాయింపులను నేను జీర్ణించుకోలేకపోతున్నానని, తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నాను. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి నెపంతో కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఫిరాయింపు చట్టం లొసుగులతో పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి రాజీవ్‌గాంధీ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. సుస్థిర ప్రభుత్వం ఉన్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని జీవన్‌రెడ్డి తప్పుపట్టారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. దురదృష్టవశాత్తు తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సంతోషించాను. కానీ ఎమ్మెల్యేల చేరికలు ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ అంటేనే జీవన్‌రెడ్డి అనే పరిస్థితి ఉన్నది. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. పార్టీకి నేను అంతే గౌరవం ఇచ్చాను. పార్టీ ఫిరాయింపులను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ అరాచకాలను అడ్డుకున్నానని తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారు కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. వారికే ప్రభుత్వంలో పెద్దపీట వేయడం ఆవేదన కలిగిస్తున్నది. పార్టీ ఫిరాయింపులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఠా నాయకులని ఆరోపించారు. ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి మాపై పెత్తనం చేయాలని ఆదేశించారు. పది మంది ఎమ్మెల్యేలు లేకుండా మా ప్రభుత్వం కొనసాగదా? రాహుల్‌ గాంధీ కోరుకున్న ప్రజాస్వామ్య విలువలు ఇవ్వేనా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ కార్యకర్త గంగారెడ్డిని సంతోష్‌ అనే యువకుడు చంపాడు. ఎన్నికల్లో అతను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశాడు.ఇప్పుడేమో కాంగ్రెస్‌ ముసుగుతో గంగారెడ్డిని హత్య చేశాడు. సంతోష్‌ గతంలో బీఆర్‌ఎస్‌ అండ చూసుకుని రెచ్చిపోయాడు. గంగారెడ్డిని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా నా తరఫున ప్రతిపాదించాను. ఆయన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు అంటున్నారు. సంజయ్‌ ఇంట్లోనే కాంగ్రెస్‌ పుడితే. బీఆర్‌ఎస్‌లోకి ఎందుకు పోయాడు? ఎవరి అండ చూసుకుని గంగారెడ్డిని సంతోష్‌ చంపాడని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

First Published:  24 Oct 2024 7:20 AM GMT
Next Story