Telugu Global
Telangana

పాలమూరుకి పర్యావరణ అనుమతి

కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి.. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతులు సాధించిందని అన్నారు మంత్రి హరీష్ రావు.

పాలమూరుకి పర్యావరణ అనుమతి
X

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఎట్టకేలకు పర్యావరణ అనుమతి లభించింది. ఈమేరకు కేంద్ర అటవీ, పర్యావణ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఉత్తర్వు కాపీలను ట్విట్టర్లో ఉంచిన మంత్రి హరీష్ రావు తన సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చారిత్రక విజయం ఇదని చెప్పారు. ఆయన మొక్కవోని దీక్ష ద్వారా లభించిన ఫలితం ఇదని అన్నారు.

కుట్రలను ఛేదించి..

కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి.. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతులు సాధించిందని అన్నారు మంత్రి హరీష్ రావు. పర్యావరణ అనుమతుల కమిటీ పర్యవేక్షణ అనంతరం ప్రాజెక్ట్ కి అనుమతులు మంజూరు చేసింది కేంద్రం. ఈమేరకు ప్రకటన విడుదలైంది.


దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగు పరుగున రాబోతోందని అన్నారు మంత్రి హరీష్ రావు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించ‌డం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధించిన మరో అపూర్వ విజయం అని, ఆయ‌న మొక్కవోని దీక్షకు, ప్ర‌భుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడవడం వల్ల ఈ ఫలితం దక్కిందని అన్నారు. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భం ఇదని సంతోషం వ్యక్తం చేశారు హరీష్ రావు. మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని మ‌ధుర ఘ‌ట్టం ఇదని, పాల‌మూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావ‌డం అపూర్వ ఆనందాన్ని ఇస్తోందని ట్వీట్ చేశారు.

First Published:  10 Aug 2023 10:19 PM IST
Next Story