Telugu Global
Telangana

కాంగ్రెస్ ఇప్పుడు బ్రోకర్ల పార్టీ.. పాల్వాయి స్రవంతి ఘాటు వ్యాఖ్యలు

ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ లో అప్పటి విలువలు లేవని మండిపడ్డారు. ఇప్పుడది బ్రోకర్ల పార్టీగా మారిపోయిందన్నారు.

కాంగ్రెస్ ఇప్పుడు బ్రోకర్ల పార్టీ.. పాల్వాయి స్రవంతి ఘాటు వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా ఆమె కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రాజీనామా లేఖలోనే తన అసంతృప్తిని అధిష్టానానికి తెలియజేసిన ఆమె, తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ లో అప్పటి విలువలు లేవని మండిపడ్డారు. ఇప్పుడది బ్రోకర్ల పార్టీగా మారిపోయిందన్నారు.

ఒక గాడిదను గుర్రం అనుకొని తీసుకు వచ్చారని, కానీ ఏదో ఒకరోజు అది గాడిద అనే నిజం తెలుస్తుందని, అప్పుడది అందర్నీ వెనక్కి తన్నక తప్పదని పరోక్షంగా రాష్ట్ర పార్టీ నాయకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాల్వాయి స్రవంతి. కొందరు బ్రోకర్లు వచ్చి పార్టీని పాతాళానికి తొక్కేశారని, కలలో కూడా ఇలాంటి పరిస్థితి తాను ఊహించలేదన్నారు. తన తండ్రి పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి 60 ఏళ్లు కాంగ్రెస్‌లోనే కొనసాగారని, ప్రత్యేక రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ను కాపాడేందుకు ఎన్నో అవమానాలకు గురై తుది శ్వాస వరకు ఆ పార్టీకే సేవలందించారన్నారు. తన తండ్రిని చూసి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నానని, కాలక్రమేణా పార్టీలో విలువలు తగ్గిపోయాయని విమర్శించారు.

ప్యారాచూట్ నేతలకే ప్రయారిటీ..

కాంగ్రెస్ ని నమ్ముకుని ఉన్నవారికి ఇప్పుడు ఆ పార్టీలో చోటు లేదని, ప్రాధాన్యత కూడా లేదని ఆవేదన వెలిబుచ్చారు స్రవంతి. ప్యారాచూట్ నాయకులకు, సీటుకు నోటు ఇచ్చినవారినే నెత్తిన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో 50 మందికిపైగా ప్యారాచూట్‌ లకే టికెట్లు ఇచ్చారని అన్నారు. మహిళలు, సీనియర్లకు స్థానం లేకుండా చేశారని వాపోయారు. ఎవరెక్కువ పైసలిస్తే, వారికే టికెట్ అనేంతగా పరిస్థితి మారిపోయిందన్నారు.

పార్టీ చచ్చిపోయిందని విమర్శించిన నేతలకు నేడు పిలిచి కండువాలు కప్పుతున్నారని, వారికే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు స్రవంతి. కాంగ్రెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అని చెప్పుకుని తిరుగుతుంటే తన కళ్లు బైర్లు కమ్మాయన్నారు. పార్టీపై తనకున్న కనీస గౌరవం కూడా పూర్తిగా పోయేలోపే తాను తప్పుకోవాలనుకున్నానని వివరించారు. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించానన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ప్రజల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. పాల్వాయి కుటుంబ అభిమానులు, తన అనుచరుల సలహా మేరకే భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానన్నారు స్రవంతి.

First Published:  11 Nov 2023 10:34 PM IST
Next Story