కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి గుడ్‌బై
ఏ వ్యక్తిపై కాంగ్రెస్ పోరాటం చేసిందో..అదే వ్యక్తి తిరిగి పార్టీలోకి వస్తే 24 గంటల్లో టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు స్రవంతి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. పాల్వాయి స్రవంతి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. బీజేపీ నుంచి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గించడంతో మనస్తాపం చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు స్రవంతి. మంత్రి కేటీఆర్ సమక్షంలో పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని సమాచారం.
ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు పాల్వాయి స్రవంతి. గతేడాదిగా జరుగుతున్న పరిణామాలతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్టీ కోసం ఎంతో సేవచేశారని గుర్తుచేశారు. పార్టీ కోసం దాదాపు 30 ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేశానని చెప్పారు స్రవంతి. 9 ఏళ్లక్రితం సర్వేల్లో తన పేరు వచ్చినప్పటికీ తనకు టికెట్ కేటాయించలేదన్నారు. ఏడాది క్రితం ఉపఎన్నికలో బీఫామ్ ఇచ్చినప్పటికీ.. పార్టీని గెలిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నించానన్నారు. పీసీసీ చీఫ్‌తో సహా పార్టీలోని సీనియర్ల నుంచి తనకు ఏ మాత్రం సహకారం లేదన్నారు.
ఏ వ్యక్తిపై కాంగ్రెస్ పోరాటం చేసిందో..అదే వ్యక్తి తిరిగి పార్టీలోకి వస్తే 24 గంటల్లో టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు స్రవంతి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని మండిపడ్డారు. వన్ ఫ్యామిలీ-వన్ టికెట్ అన్న కీలక నిర్ణయాన్ని సైతం పక్కనపెట్టారని.. ఉపఎన్నికల్లో పోటీ చేసిన వారికి ప్రాధాన్యమిస్తామన్న మాటను సైతం అటకెక్కించారంటూ లేఖలో రాసుకొచ్చారు. తెలంగాణలో పార్టీకి సారథ్యం వహిస్తున్నవారు నిర్మోహమాటంగా కౌంటర్లు తెరిచి పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు స్రవంతి.
స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి దాదాపు 5 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ఇక ఇటీవల రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి 23 వేలకుపైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అయితే రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం, పార్టీ ఆయనకే టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన స్రవంతి పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇటీవల మునుగోడు టికెట్ ఆశించిన చలమల్ల కృష్ణారెడ్డిసైతం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ గూటికి చేరారు.