నేను పార్టీ మారలేదు, కానీ..! స్రవంతి వెరైటీ వివరణ
అసలు నిజమేంటో కూడా పాల్వాయి స్రవంతి తేల్చి చెప్పారు. మునుగోడు, చండూరు మండలాల్లో ముఖ్య నాయకుల్ని, తన అభిమానుల్ని కలసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నట్టు తెలిపారు స్రవంతి. అంటే ఆమె పార్టీ మారుతున్నట్టు వచ్చిన ఊహాగానాలకు ఆమే మరింత బలం చేకూర్చారు.
మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆమె వివరించారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తనపై జరిగిన తప్పుడు ప్రచారాన్నే మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు ఆ వార్తల్ని నమ్మొద్దని, అదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.
అసలు నిజమేంటి..?
అసలు నిజమేంటో కూడా పాల్వాయి స్రవంతి తేల్చి చెప్పారు. మునుగోడు, చండూరు మండలాల్లో ముఖ్య నాయకుల్ని, తన అభిమానుల్ని కలసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నట్టు తెలిపారు స్రవంతి. అంటే ఆమె పార్టీ మారుతున్నట్టు వచ్చిన ఊహాగానాలకు ఆమే మరింత బలం చేకూర్చారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఉంటానని కూడా ఆమె చెప్పలేదు. బీఆర్ఎస్ లో చేరారన్న వార్తల్ని మాత్రమే ఆమె ఖండించారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కి, స్రవంతికి దూరం పెరిగింది. అయితే ఆమె ఏ పార్టీకి దగ్గరవుతారనేదే ఇప్పుడు సస్పెన్స్.
ఎందుకీ గొడవ..?
2014లో కూడా మునుగోడు టికెట్ ఇవ్వలేదని అలిగి.. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ రెబల్ గా అక్కడ పోటీ చేశారు, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. గతేడాది రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో స్రవంతికి, కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇచ్చింది. కానీ ఫలితం లేదు. ఈ ఎన్నికల్లో దాదాపుగా టికెట్ ఆమెదేనని అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీనుంచి కాంగ్రెస్ లో చేరి టికెట్ పట్టేశారు. దీంతో స్రవంతికి నిరాశ ఎదురైంది. చెప్పడమూ తెలుసు, చెప్పుతో కొట్టడమూ తెలుసంటూ సొంత పార్టీ నేతలపైనే ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె పార్టీ మారబోతున్నారంటూ కథనాలు వినిపించాయి. సడన్ గా వాటిని ఖండిస్తూ వార్తల్లోకెక్కారు స్రవంతి. కానీ అభిమానులతో చర్చలు మాత్రం జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. ఆ చర్చలు ఓ కొలిక్కి వస్తే.. ఆమె దారి ఎటువైపు అనేది తేలిపోతుంది. అప్పటి వరకు ఈ సెల్ఫీ వీడియోనే నమ్మి తీరాలి.