Telugu Global
Telangana

పాల్వాయి ఆశలపై ఎంపీ నీళ్ళు చల్లేశారా?

మునుగోడు ఎన్నికల ప్రచారం చేసేదిలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగేసి చెప్పేశారు. ఎంపీ తాజా ప్రకటనతో పాల్వాయికి ఏమిచేయాలో దిక్కుతోచటం లేదు.

పాల్వాయి ఆశలపై ఎంపీ నీళ్ళు చల్లేశారా?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పాల్వాయి స్రవంతి ఆశలపై భువనగిరి ఎంపీ, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీళ్ళు చల్లేశారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారని, గెలిపిస్తారని గేమ్ ఛేంజర్‌గా అందరు అనుకుంటున్న వెంకటరెడ్డి చివరకు పాల్వాయికి పార్టీ గుర్తునే చూపించారు. నిజానికి కాంగ్రెస్ తరపున పోటీలోకి దింపాలని రేవంత్ వేరే నేత కోసం పట్టుబట్టారట.

అయితే వెంకటరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే గెలిపించుకొచ్చే బాధ్యత తనదే అని చెప్పారు. అనేక విషయాలను ఆలోచించిన అధిష్టానం ఎంపీ మాటకే విలువిచ్చి స్రవంతికే టికెట్ ఇచ్చింది. అయితే అభ్యర్ధిగా అయిన దగ్గర నుండి నియోజకవర్గంలో మారిపోతున్న పరిణామాలు పాల్వాయికి దిక్కుతోచనీయటం లేదట. ఎప్పటికప్పుడు ఎంపీ తనకు మద్దతుగా ప్రచారంలోకి దిగుతారని, గెలిపిస్తారని స్రవంతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

రేవంత్ రెడ్డితో పాటు లోకల్ లీడర్లు తనను అవమానించారని వెంకటరెడ్డి అలిగి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాంతో ఎంపీకి రేవంత్ రెండుసార్లు బహిరంగంగానే సారీ కూడా చెప్పారు. అయినా సరే ఎంపీ తన అలకవీడలేదు. పార్టీ నేతలతో గాంధీభవన్లో జరిగిన సమావేశాల్లో కూడా ఎంపీ తనకు మద్దతుగా ప్రచారం చేస్తానని, గెలిపిస్తారని మాటిచ్చినట్లు పాల్వాయి గట్టిగా వాదించారు. స్రవంతి ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా ఎంపీ అయితే ప్రచారంలోకి దిగలేదు.

చివరకు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు ఎంపీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను మునుగోడు ఎన్నికల ప్రచారం చేసేదిలేదని తెగేసి చెప్పేశారు. ఎంపీ తాజా ప్రకటనతో పాల్వాయికి ఏమిచేయాలో దిక్కుతోచటం లేదు. అయినా బీజేపీ తరపున పోటీ చేస్తున్నది స్వయంగా ఎంపీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డే అని తెలిసినా అన్న వెంకటరెడ్డి తనకు ప్రచారం చేస్తారని, గెలిపిస్తారని స్రవంతి అంత అమాయకంగా ఎలాగ అనుకున్నారో ? అర్ధం కావటంలేదు. ఎంపీ ఫైనల్ డెసిషన్ తర్వాత రేవంత్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

First Published:  18 Oct 2022 2:34 PM IST
Next Story