Telugu Global
Telangana

స్రవంతి డిమాండ్ ఏంటో వివరించిన కేటీఆర్..

పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరే సమయంలో పెట్టిన కండిషన్ ఏంటి..? మంత్రి కేటీఆర్ ని ఆమె ఏం అడిగారు..? దీనికి ఆయన సమాధాం ఏంటి..?

స్రవంతి డిమాండ్ ఏంటో వివరించిన కేటీఆర్..
X

సహజంగా పార్టీ మారే సందర్భంలో కొత్త పార్టీలో తమ భవిష్యత్ కి గ్యారెంటీ అడుగుతుంటారు నేతలు. ఎన్నికల వేళ టికెట్లు అడిగేవారు కొందరు, టికెట్ లేకపోతే నామినేటెడ్ పోస్ట్ లపై అయినా మాట తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి లాంటి కాంట్రాక్టర్లయితే బీజేపీలో చేరే సమయంలో పెద్ద ఎత్తున పనులు దక్కించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరే సమయంలో పెట్టిన కండిషన్ ఏంటి..? మంత్రి కేటీఆర్ ని ఆమె ఏం అడిగారు..? దీనికి ఆయన సమాధాం ఏంటి..?

తన కోసం కాదు..

పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరే సమయంలో తన గురించి ఒక్క హామీ కూడా అడగలేదన్నారు మంత్రి కేటీఆర్. తన భవిష్యత్తు గురించి కాకుండా.. కష్ట కాలంలో తన వెంట నడిచిన నాయకులు, అనుచరుల గురించి ఆమె అడిగారని చెప్పారు. వారి భవిష్యత్తు బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఒక సోదరుడిలాగా స్రవంతిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్.

కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల తరబడి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుటుంబం అండగా నిలబడిందని.. అలాంటి కుటుంబంలోని వ్యక్తిని ఆ పార్టీ తీవ్రంగా అవమానపరిచిందని అన్నారు మంత్రి కేటీఆర్. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి ఎవరూ ముందుకు రాని సమయంలో స్రవంతి కాంగ్రెస్‌ పరువు కాపాడారని చెప్పారు. ఆ ఎన్నికల్లో గోవర్దన్ రెడ్డి కుటుంబాన్ని వాడుకున్న కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికలనాటికి ఫిరాయింపు నేత రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఖరారు చేసిందని విమర్శించారు కేటీఆర్. డబ్బు మదంతో విర్రవీగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసలు రాజగోపాల్ రెడ్డి, రాజీనామా చేసి బీజేపీలోకి ఎందుకు వెళ్లారు? మళ్లీ తిరిగి కాంగ్రెస్‌ లో ఎందుకు చేరారు? ఎవరికీ తెలియదన్నారు. స్రవంతితోపాటు, ఆమె అనుచరులకు కూడా బీఆర్ఎస్ లో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు కేటీఆర్.

First Published:  13 Nov 2023 7:47 AM IST
Next Story