పాలమూరుపై విపక్షాల విషప్రచారం..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవని, పిల్లి శాపాలకు ఉట్లు తెగవని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రతిపక్షాలకు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ముందు జూరాల నుంచి పనులు మొదలుపెట్టాలని వాదించారని, తర్వాత అటవీ ప్రాంతం అంటూ ఫిర్యాదులు చేశారని, పర్యావరణం దెబ్బతింటోందని గ్రీన్ ట్రిబ్యునల్ ని కూడా ఆశ్రయించారని, ఓ దశలో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా ప్రతిపక్ష నేతలు చేశారన్నారు. అన్ని అడ్డంకులను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు నిరంజన్ రెడ్డి.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒకే ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు మంత్రి నిరంజన్ రెడ్డి. మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నామన్నారు. 60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా కేసీఆర్ నాయకత్వంలో నిలదొక్కుకుంటోందన్నారు. పాలమూరుకు నీళ్లొస్తే కాంగ్రెస్, బీజేపీ నేతల రాజకీయ జీవితాలు శాశ్వతంగా కూలిపోతాయన్న భయంతోనే విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పిల్లిశాపాలకు ఉట్లు తెగవు..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవని, పిల్లి శాపాలకు ఉట్లు తెగవని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరుకు నీళ్లొస్తే ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడుతుందనే సదుద్దేశం ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రాజెక్టు విఫలం కావాలి అన్న ఆకాంక్ష వారికి ఎక్కువగా ఉందన్నారు. సుధీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీరు, తెలంగాణ గర్వించదగిన ఇంజనీరు అయిన పెంటారెడ్డి మీద కూడా బురదజల్లాలనుకోవడం భావ్యం కాదని మండిపడ్డారు మంత్రి.