కేసీఆర్ కి జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి..
కాంగ్రెస్ అభ్యర్థి జై కేసీఆర్ అనడంతో హస్తం పార్టీ నేతలకు కూడా ఏం చెప్పాలో దిక్కుతోచడంలేదు. పోనీ అలవాటులో పొరపాటా అంటే ఆమె బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన నాయకురాలు కూడా కాదు. కేసీఆర్ పై అభిమానంతోనే ఆమె అలా అన్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారం అంతా పూర్తయ్యాక, ఇక ఉంటాను, సెలవు అంటూ జై కేసీఆర్ అని నినదించారు కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి. ఆ తర్వాత ఆమె కవర్ చేసుకోవాలనుకున్నా కుదర్లేదు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జై కేసీఆర్..
వాస్తవానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఎన్నారై హనుమానండ్ల ఝాన్సీరెడ్డి ఆశించారు. ఆమెకు భారత పౌరసత్వం లేకపోవడం సమస్యగా మారింది. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డిని పాలకుర్తి నుంచి బరిలో దించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎర్రబెల్లితో పోటీ అంత ఈజీ కాదని తెలిసినా కూడా.. యశస్విని ప్రచారంతో హడావిడి సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారంలో జై కేసీఆర్ అనడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తెలంగాణ ప్రజల గుండెల్లోనే కాదు, ప్రత్యర్థుల మనసుల్లో కూడా ఉన్నది కేసీఆరే.
— BRS Party (@BRSparty) November 21, 2023
కేసీఆర్ కే జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి!#KCROnceAgain #VoteForFor pic.twitter.com/CG8nrrQMn0
గెలుపు ఓటముల సంగతి పక్కనపెడితే యశస్విని రెడ్డి ప్రచారంలో మాత్రం దూసుకెళ్తున్నారు. పాలకుర్తిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అడిగినవారికి, అడగనివారికి అందరికీ ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నారు. ప్రచారంలో సినిమా డైలాగులు కొడుతూ ఆకట్టుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆమె మనసులో మాట బయటపెట్టారంటూ బీఆర్ఎస్ కౌంటర్లిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి జై కేసీఆర్ అనడంతో హస్తం పార్టీ నేతలకు కూడా ఏం చెప్పాలో దిక్కుతోచడంలేదు. పోనీ అలవాటులో పొరపాటా అంటే ఆమె బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన నాయకురాలు కూడా కాదు. కానీ కేసీఆర్ పై అభిమానంతోనే ఆమె అలా అన్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.