Telugu Global
Telangana

ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లోనే - పద్మారావు గౌడ్

తనపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు పద్మారావు గౌడ్. ఊపిరి ఉన్నంత కాలం టీఆర్ఎస్‌ను వదిలేది లేదన్నారాయన. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మళ్ళీ తానే పోటీ చేస్తానని చెప్పారు.

ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లోనే - పద్మారావు గౌడ్
X

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్ ఉన్న ఒక వీడియోని కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పార్టీ మార్పు ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై పద్మారావు గౌడ్ సీరియస్‌గా స్పందించారు. తన ఇంట్లో శుభకార్యానికి రాలేకపోయిన కిషన్ రెడ్డి, ఆ తర్వాత తమ ఇంటికి వచ్చారని, తమ బిడ్డలను ఆశీర్వదించారని, అంత మాత్రాన దాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌తో ఉన్నఫొటోలను ట్వీట్ చేస్తూ.. ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.

ఎమోషనల్ బ్లాక్ మెయిలింగా..?

ఇటీవల బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్‌కి రాజీనామా చేశారు, బీజేపీలో చేరబోతున్నారు. ఈ క్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన పద్మారావు గౌడ్ కూడా టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మరిన్ని చేరికలుంటాయని చెప్పిన మాటల్ని పద్మారావు గౌడ్‌కి అన్వయించారు కొందరు. అన్నిటికీ మించి కిషన్ రెడ్డితో పద్మారావు గౌడ్ కలసి ఉన్న వీడియో ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. పాత వీడియోని ఇప్పుడు కావాలనే తెరపైకి తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు పద్మారావు గౌడ్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

అటు కిషన్ రెడ్డి కూడా ఈ వివాదంపై స్పందించారు. పద్మారావు గౌడ్ ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమే కానీ, రాజకీయాలు తమ మధ్య చర్చకు రాలేదన్నారు కిషన్ రెడ్డి. మొత్తమ్మీద మునుగోడు ఉప ఎన్నికల వేళ పద్మారావు గౌడ్ పేరుతో జరిగిన ప్రచారం మాత్రం కలకలం రేపుతోంది. దీనిపై వెంటనే స్పందించిన ఆయన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఊపిరి ఉన్నంత కాలం టీఆర్ఎస్‌ను వదిలేది లేదన్నారాయన. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మళ్ళీ తానే పోటీ చేస్తానని చెప్పారు. పూర్తిగా ఉద్యమకారులతోనే ప్రభుత్వాన్ని నడపలేమని, ప్రభుత్వానికి కొన్ని అవసరాలు ఉంటాయని, ఆ అవసరాల మేరకు నాయకుల్ని ఉద్యమకారుల్ని సమానంగా ఉపయోగించుకుంటుందని తెలిపారు.

First Published:  19 Oct 2022 3:21 PM IST
Next Story