పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూత
గుస్సాడి నృత్యానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిన తెలంగాణ కళాకారుడు కనకరాజు
తెలంగాణ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన కనకరాజు కన్నుమూశాడు. ఆదిలాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనను 2021లో పద్మశ్రీతో సత్కరించింది. రేపు మార్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆసీఫాబాద్‌లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరుచూ ప్రదర్శిస్తూ.. భావితరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దీంతో ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీ కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. 2021 నవంబర్ 9న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
అరుదైన కళాకారుడు: రేవంత్‌రెడ్డి
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశవ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన అరుదైన కళాకారుడని, వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ వికాసానికి తీరని లోటు: కేసీఆర్
తెలంగాణ సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.ఆదివాసీ జీవన విధానంలో విశిష్టతను సంతరించుకున్న సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య అభ్యున్నతికి తన జీవితకాలం కృషి చేసిన కనకరాజు మరణం, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ వికాసానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. పద్మశ్రీ కనకరాజు చేసిన కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని తగురీతిలో ప్రోత్సహించి సత్కరించిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
గుస్సాడి నృత్యానికి దేశవ్యాప్త ప్రఖ్యాతి తెచ్చారు: కేటీఆర్
ఆదివాసీల జానపద గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన గుస్సాడి కనకరాజు గారి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు.గుస్సాడి కనకరాజు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు ఆదివాసీల గుస్సాడి నృత్యానికి దేశవ్యాప్త ప్రఖ్యాతి తీసుకువచ్చారని, ఎర్రకోటపైన కూడా తన నృత్యాన్ని ప్రదర్శించారని కేటీఆర్ గుర్తు చేశారు. గుస్సాడి నృత్యానికి తన జీవితాన్ని ఆయన అంకితం చేశారని కేటీఆర్ కొనియాడారు. ఆదివాసీల కళకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకుందని తెలియజేసిన కేటీఆర్.. ఆయన సేవలను స్మరించుకున్నారు.