Telugu Global
Telangana

ప్రజాపాలనలో పద్మశ్రీ మొగులయ్యకు ఎంత కష్టమొచ్చింది?

గత ప్రభుత్వం మంజూరు చేసిన నెలవారీ 10వేల గౌరవ వేతనం ఇటీవలే ఆపేశారన్నారు మొగులయ్య. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నారు.

ప్రజాపాలనలో పద్మశ్రీ మొగులయ్యకు ఎంత కష్టమొచ్చింది?
X

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య రోజువారి కూలీగా మారారు. హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయాంజల్‌లోని ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తూ మొగులయ్య కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని దాంతో కూలీ పనులు చేసుకుంటున్నానని వాపోయారు మొగులయ్య. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని.. తనకు, తన కొడుక్కి మందుల కోసమే నెలకు 7వేల రూపాయలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

సాయం కావాలనే ఆపేశారా..?

గత ప్రభుత్వం మంజూరు చేసిన నెలవారీ 10వేల గౌరవ వేతనం ఇటీవలే ఆపేశారన్నారు మొగులయ్య. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నారు. తనకు కోటి రూపాయల గ్రాంట్‌తో పాటు, రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్లు గతప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ వాటి కేటాయింపు ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకిందటే సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు మొగులయ్య. ఆయన పాటకు రేవంత్ కూడా ఫిదా అయ్యారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తీరా ఆయన గౌరవ వేతనం కూడా ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి.

భీమ్లా నాయక్‌తో గుర్తింపు..

అరుదైన సంగీత వాయిద్యమైన "కిన్నెర"ను తిరిగి ఆవిష్కరించినందుకు దర్శనం మొగులయ్యను 2022లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా పాటతో మొగులయ్యకు మంచి పేరొచ్చింది.

First Published:  3 May 2024 11:11 AM IST
Next Story