అమ్మ, నాన్న, కొడుకు.. ప్రత్యర్థి మాత్రం పద్మక్కే..!
ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదయినా గానీ పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, ఇప్పుడు కుమారుడి మీద కూడా పోటీ చేస్తున్నారు.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మరోసారి బరిలో నిలబడ్డారు. ఆమెపై సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపినా ప్రధానమైన పోటీ పద్మ, రోహిత్‌ల మధ్యే దోబూచులాడుతోంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదయినా గానీ పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, ఇప్పుడు కుమారుడి మీద కూడా పోటీ చేస్తున్నారు.
20 ఏళ్లుగా ఆమే
మెదక్ నియోజకవర్గం 2004 వరకు రామాయంపేటగా ఉండేది. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు భార్య, ప్రస్తుత అభ్యర్థి రోహిత్‌రావు తల్లి వాణి పోటీ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా పద్మా దేవేందర్‌రెడ్డి ఆమెపై పోటీ చేసి గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు విజయం సాధించారు. పునర్విభజన తర్వాత రామాయంపేటను మెదక్ నియోజకవర్గంలో కలిపేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇవ్వడంతో అలకబూనిన పద్మా దేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లోనూ హన్మంతరావే నెగ్గారు.
మల్కాజిగిరికి వెళ్లిన మైనంపల్లి
2014లో (ఇప్పటి బీఆర్ఎస్) టీఆర్ఎస్‌లో చేరిన హన్మంతరావు.. మెదక్ వదిలి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో మెదక్‌లో తన కుమారుడు రోహిత్‌రావుకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని కారు వదిలి కాంగ్రెస్ చేయందుకున్న మైనంపల్లి తన కొడుక్కి మెదక్ కాంగ్రెస్ టికెట్ సాధించుకోగలిగారు. అయితే ఇప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మా దేవేందర్‌రెడ్డే ఉన్నారు. అలా అమ్మ.. నాన్న.. కుమారుడిపై ఒకే అభ్యర్థి పోటీ చేయడం ఆసక్తికరం. తనను రెండుసార్లు ఓడించిన హన్మంతరావు కొడుకుపై గెలిచి పద్మక్క లెక్క సరి చేస్తుందా లేదో చూడాలి.