Telugu Global
Telangana

ఎమ్మెల్సీ కవితకు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం.. ఎందుకంటే..?

తెలంగాణ విజయాలు నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఈ స్ఫూర్తి ఖండాంతరాలు దాటడం విశేషం.

ఎమ్మెల్సీ కవితకు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం.. ఎందుకంటే..?
X

ఎమ్మెల్సీ కవితకు యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 30న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు. ‘డెవలప్‌ మెంట్‌ ఎకనామిక్స్‌’ అనే అంశంపై ఆమె ప్రసంగించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కవిత కీలక ఉపన్యాసం ఇస్తారు.

ఇటీవలే మంత్రి కేటీఆర్ కు ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్ కోసం ఈ ఆహ్వానాన్ని అందించారు హార్వర్డ్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు. 'ఫైర్ సైడ్ చాట్' పేరుతో చర్చాగోష్టి నిర్వహించబోతున్నారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులకు రాష్ట్రం కేంద్రంగా ఎలా మారిందనే విషయాలపై హార్వర్డ్ విద్యార్థులు కేటీఆర్ సందేశాన్ని వినాలనుకుంటున్నారు. ఆయన సందేశం తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ విజయాలు నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులు, నాయకులు ఇక్కడకు వచ్చి పర్యటించి పథకాల వివరాలు తెలుసుకుని వెళ్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో తెలంగాణ పథకాలకు, పల్లెలకు వస్తున్న అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్ఫూర్తి ఖండాంతరాలు దాటడం విశేషం. విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్శిటీల్లో సైతం తెలంగాణ విజయాలు అక్కడి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం కావడం గొప్ప విషయం. ఆ స్ఫూర్తిని నింపేందుకు బీఆర్ఎస్ నేతల్ని ప్రత్యేకంగా వారు పిలిపించుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి విజయగాథలను వారి నోటివెంటే వినాలని ఆశపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవితకు కూడా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఇలాగే ఆహ్వానం అందింది. డెవలప్ మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ఆమె తన ప్రసంగంలో.. తెలంగాణ అభివృద్ధిని వివరించబోతున్నారు.


First Published:  24 Oct 2023 9:08 AM GMT
Next Story