కేసీఆర్ వల్లే తెలంగాణ ఇంతలా అభివృద్ధి చెందింది.. బీహార్‌లో ఓవైసీ ప్రశంసలు
తెలంగాణకు ఎలాంటి సముద్రతీరం లేదు. అయినా సరే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో దూసుకొని పోతోందని ఓవైసీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొని పోవడానికి సీఎం కేసీఆర్ దార్శనికతే కారణమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీహార్‌లో అత్యంత వెనుకబడిన సీమాంచల్ ప్రాంతంలో ఓవైసీ పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులు అసదుద్దీన్‌ను కేసీఆర్ ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. కేసీఆర్ ఎంతో ముందు చూపు కలిగిన వ్యక్తని.. ఆయన గొప్ప దార్శనికుడని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.
తెలంగాణకు ఎలాంటి సముద్రతీరం లేదు. అయినా సరే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో దూసుకొని పోతోందని అన్నారు. దేశంలో పంపు సెట్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. అయినా సరే మత్స్య సంపద ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఒక గొప్ప నేత అని.. ఆయన జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారని ప్రశంసించారు.
తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ సారి కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఓవైసీ అంచనా వేశారు. బీజేపీ నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ, బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని ఓవైసీ అన్నారు.
కాగా, బీహార్‌లో ఎంఐఎం విస్తరణకు ఓవైసీ నడుంభిగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 5 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నది. అయితే, వాళ్లు గత ఏడాది ఆర్జేడీలో జాయిన్ అయ్యారు. వీరిలో ఒకరికి క్యాబినెట్ బెర్త్ కూడా దక్కడం గమనార్హం. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని బాధపడుతున్నారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు. కానీ బీహార్‌లో స్వయంగా వారి మిత్ర పక్షమే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే కనీసం స్పందించలేదని ఓవైసీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది ఈ విషయంలో ద్వంద వైఖరి అని ఓవైసీ ఆరోపించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోడీకి తలాఖ్ చెప్పి.. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌తో నిఖా (పెళ్లి) చేసుకున్నారని ఎద్దేవా చేశారు.