Telugu Global
Telangana

మా ఓట్లన్నీ కారు గుర్తుకే.. ఇళ్ల బయట సైన్ బోర్డులు

తమ ఇంటిలోని ఓట్లన్నీ కారుగుర్తుకే వేస్తామని, మిగతా పార్టీల వారు తమ వద్దకు వచ్చి ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

మా ఓట్లన్నీ కారు గుర్తుకే.. ఇళ్ల బయట సైన్ బోర్డులు
X

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఊళ్లకు ఊళ్లు తీర్మానాలు చేశాయి. సర్పంచ్ ల తో ఆ తీర్మానాల కాపీలను ఆయా నాయకులకు పంపించేవారు ప్రజలు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు ఇలా తీర్మానాల కాపీలు వచ్చాయి. తమ ఓట్లన్నీ బీఆర్ఎస్ కే నంటూ ప్రజలు తీర్మానాలు చేసేవారు. తాజాగా ఇప్పుడు తెలంగాణలోని పలు గ్రామాల్లో తమ ఓట్లు బీఆర్ఎస్ కే అనే సైన్ బోర్డ్ లు కొన్ని ఇళ్లముందు కనపడుతున్నాయి.

గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రకటనలు ఇంటి గోడలపై రాసిన ఉదాహరణలున్నాయి. ఇప్పుడు పేపర్ పై ప్రింట్ తీసి, వాటిని ఇంటి గేటుకి అతికిస్తున్నారు. ఇలాంటి ప్రకటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సంగెం-శ్రీరాంపూర్‌ గ్రామంలో కనపడింది. జంగం శేఖర్‌-రవీణ దంపతులు బీఆర్‌ఎస్‌పై తమకున్న ఆదరాభిమానాలను ఇలా చూపించారు. వారేమీ పార్టీ కార్యకర్తలు కాదు. సీఎం కేసీఆర్ అంటే అభిమానం, బీఆర్ఎస్ అంటే వారికి నమ్మకం. అందుకే ఈ ఎన్నికల్లో తమ ఓటు కారు గుర్తుకే అని తీర్మానించారు. కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ ఇంటి బయట బోర్డు పెట్టారు.

ఫలానా వారు ఫలానా పార్టీ సానుభూతిపరులు అని తెలిసినా కూడా ఎన్నికల వేళ అన్ని పార్టీల నాయకులు వారి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తారు. ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే, కనీసం ఒక్క ఓటయినా తమ పార్టీకి వేయాలని అభ్యర్థిస్తారు. అలాంటి వారు కూడా తమ ఇంటికి రావద్దంటున్నారు శేఖర్-రవీణ దంపతులు. తమ ఇంటిలోని ఓట్లన్నీ కారుగుర్తుకే వేస్తామని, మిగతా పార్టీల వారు తమ వద్దకు వచ్చి ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు.

First Published:  16 Nov 2023 9:36 AM IST
Next Story