కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాలేజీలు కట్టిన
హైడ్రాతో ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోతలేరు : మాజీ మంత్రి మల్లారెడ్డి
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తాను కాలేజీలు నిర్మించానని మాజీ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం యాదిగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని ఆయన దర్శించుకొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హైడ్రా పేరుతో ఏ ఒక్కరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదన్నారు. అందరికి ఇచ్చినట్టే తనకూ నోటీసులు ఇచ్చారన్నారు. ప్రభుత్వం యుద్ధం చేసినట్టు అందరి ఇళ్లను కూల్చివేస్తుందన్నారు. ఇండ్లు కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలని.. ఒక్కో లీడర్ ఒక్కో గ్రూపు తయారు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే హైడ్రా పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారని, కేసీఆర్ పాలనలో పండిన పంటకన్నా ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ లీడర్లకు తాను పాలాభిషేకం చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు రైతులకు రైతుభరోసా ఇవ్వలేదని, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. ఇకనైనా డైవర్షన్ రాజకీయాలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.